బ్యాంకు ఉద్యోగులు నేటి నుండి చేపట్టాల్సిన దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. తమ ప్రధాన డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, అంటే ఐబీఏ నుంచి హామీ లభించడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, యూఎఫ్‌బీయూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడు రోజుల సమ్మె నిలిచిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కోరుతున్న ప్రధాన అంశాల్లో శనివారాల సెలవు కూడా ఒకటి. ప్రస్తుతం నెలలో మొదటి, మూడో, ఐదో శనివారాలు బ్యాంకులకు పని దినాలుగా ఉన్నాయి. వీటిని కూడా సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నారు.
ఈ కమిటీ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లతో పాటు ఖాతాదారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తుంది. సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక స్కేల్-4, ఆపై స్థాయి అధికారులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, అంటే పీఎల్‌ఐలో మార్పుల అంశంపైనా చర్చలు కొనసాగనున్నాయి. ఈ పథకంపై యూనియన్లు, అధికారుల సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించేలా ఐబీఏతో చర్చించి, అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు.
అదే సమయంలో 2024 మార్చి 8న జరిగిన సమావేశపు మినిట్స్‌లో ప్రస్తావించిన మిగిలిన అంశాలపైనా చర్చలు జరిపి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ అంశాలపై ఐబీఏ నుంచి హామీ లభించిన నేపథ్యంలో ప్రతిపాదిత నిరసన కార్యక్రమాలతో పాటు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం బ్యాంకు సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని యూఎఫ్‌బీయూ తెలిపింది.


