TG: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 41 మద్యం బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. పెరిగిన జనాభా, కొత్త పురపాలక సంఘాల ఆవిర్భావం, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వ్యాపారుల నుంచి 2బీ బార్ల లైసెన్సుల నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఒక్కో అప్లికేషన్‌కు నాన్-రీఫండబుల్ ఫీజుగా ఏకంగా రూ.1 లక్ష నిర్ణయించడం ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సెప్టెంబర్ 28 నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ గడువు అందుబాటులో ఉంటుంది. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ఏరియాల్లో ఏర్పాటయ్యే 14 బార్లకు సంబంధించి హైదరాబాద్‌లోని అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్థానిక డీసీ ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని మిగిలిన 27 బార్లకు సంబంధిత ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ లేదా డీపీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది.
ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని బార్లంటే..
సైబరాబాద్ పరిధిలోని అలియాబాద్‌లో ఒకటి, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో రెండేసి బార్లకు అవకాశం కల్పించారు. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఫ్యూచర్ సిటీ, చేవెళ్లలో ఒక్కొక్కటి, మొయినాబాద్‌లో రెండు బార్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. అలాగే వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి.. సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం, కోహిర్‌లలో ఒకటి చొప్పున, గుమ్మడాలలో రెండు బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆసిఫాబాద్, అశ్వారావుపేట, కల్లూరు, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, బోధన్, బీబీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, కే సముద్రం, ములుగు మున్సిపాలిటీల పరిధిలో కొత్త బార్ల లైసెన్సులు దక్కనున్నాయి.
ఎక్సైజ్ ఫీజుల వివరాలు
లైసెన్స్ పొందిన బార్లకు ప్రాంతాల వారీగా వార్షిక ఎక్సైజ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. క్యూర్ పరిధిలోని బార్లకు సంవత్సరానికి రూ.44 లక్షలుగా నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లా బోధన్ బార్‌కు సంవత్సరానికి రూ.42 లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల బార్లకు ఏడాదికి రూ.30 లక్షలుగా వసూలు చేయనున్నారు. ఈ నిబంధనలు, దరఖాస్తు సమర్పణ విధివిధానాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. కొత్త బార్ల కేటాయింపు ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి.








