National

EPFO: కన్నీటి వేళ కొండంత అండ! ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ ప్రాసెస్.. సభ్యుడు మరణిస్తే కుటుంబం ఏం చేయాలి?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

EPFO: ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నట్లుండి తనువు చాలిస్తే.. ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో వర్ణించలేనిది. కంటిముందు బతుకు శూన్యమై, రేపటి జీవనంపై ప్రశ్నార్థకం మిగిలిన వేళ, చాలామందికి తమ హక్కులేమిటో తెలియక మరింత కుంగిపోతుంటారు.

EPFO: ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నట్లుండి తనువు చాలిస్తే.. ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో వర్ణించలేనిది. కంటిముందు బతుకు శూన్యమై, రేపటి జీవనంపై ప్రశ్నార్థకం మిగిలిన వేళ, చాలామందికి తమ హక్కులేమిటో తెలియక మరింత కుంగిపోతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో వేతన జీవులుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కల్పిస్తున్న రక్షణ కవచంపై సమాజంలో ఇప్పటికీ ఎంతో మందికి సరైన అవగాహన లేదు.

పీఎఫ్ అంటే కేవలం ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పొదుపు పైసలే అనుకుంటారు చాలా మంది. కానీ సర్వీసులో ఉండగా సదరు ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే, బాధిత కుటుంబానికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మూడు కీలక ఆర్థిక ఊరటలు చట్టబద్ధంగా లభిస్తాయని ఎంత మందికి తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి అడుగులు వేయాలి? బెనిఫిట్స్ ఎలా పొందాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

పైసా ప్రీమియం లేకుండా రూ.7 లక్షల దాకా ఫ్రీ బీమా

ఈపీఎఫ్ఓ పరిధిలో ఉద్యోగిగా చేరిన ఫస్ట్ డే నుంచే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీని కోసం ఉద్యోగి వేతనం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా కట్ కాదు. పూర్తిగా కంపెనీలే నిధులను సమకూరుస్తాయి. ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణిస్తే, ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.7 లక్షల వరకు జీవిత బీమా పరిహారం నామినీ లేదా కుటుంబానికి నేరుగా అందుతుంది. దీనిని క్లెయిమ్ చేసుకోవడానికి ఫారం 5IF ని పూర్తి చేసి సంబంధిత పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది.

వడ్డీతో సహా పీఎఫ్ పైసలు..

ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు మరో రెండు కీలక ఉపశమనాలు బాధిత కుటుంబానికి దక్కుతాయి. మొత్తం పీఎఫ్ సొమ్ము ఒకేసారి (ఫారం 20) బాధిత కుటుంబానికి అందుతుంది. సభ్యుడి పీఎఫ్ ఖాతాలో అప్పటివరకు జమ అయిన ఉద్యోగి వాటా, సంస్థ వాటాతో పాటు పూర్తి వడ్డీని లెక్కగట్టి వన్ టైం సెటిల్‌మెంట్ నామినీకి చెల్లిస్తారు. దీని కోసం ఫారం 20 ని సమర్పించాలి. ఇంట్లో సంపాదించే వ్యక్తి లేని లోటును తీర్చలేకపోయినా, కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగి సర్వీస్ ఆధారంగా జీవిత భాగస్వామికి జీవితాంతం, అర్హులైన పిల్లలకు ప్రతి నెలా పింఛను అందుతుంది. దీనిని క్లెయిమ్ చేయడానికి ఫారం 10D ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

నామినేషన్ లేకపోతే పరిహారం రాదా

చాలామంది ఉద్యోగులు ఈ-నామినేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకవేళ ఉద్యోగి నామినీ పేరు నమోదు చేయకపోయినా లేదా ఆ వివరాలు చెల్లకున్నా కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చట్టబద్ధమైన వారసులు తమ హక్కును నిరూపించుకుంటూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో వివాదాలు తలెత్తకుండా లీగల్ హెయిర్ (వారసత్వ) ధ్రువీకరణ పత్రం లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో అవసరమయ్యే కీలక పత్రాలు

ఈ ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో చేపట్టేందుకు ఈ పేపర్స్ రెడీ చేసుకోవాలి. మరణించిన సభ్యుడి ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్, ఉద్యోగి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), క్లెయిమ్ చేస్తున్న నామినీ లేదా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, పుట్టిన తేదీ వివరాలు, లబ్ధిదారుడి యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలు (క్యాన్సిల్డ్ చెక్ లేదా పాస్‌బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్) కావాల్సి ఉంటుంది. అలాగే పిల్లల వయస్సు ధ్రువీకరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండాలి.

బాధిత కుటుంబం చేయాల్సిన తక్షణ కర్తవ్యం

విషాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఉద్యోగి పని చేసిన చివరి కంపెనీ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. సాధారణంగా పీఎఫ్ డిపాజిట్ సొమ్ము త్వరగానే ప్రాసెస్ అయినప్పటికీ, సర్వైవర్ పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సర్వీస్ రికార్డుల పరిశీలన అవసరం కావడంతో కొంత సమయం తీసుకుంటుంది. మధ్యవర్తులను ఆశ్రయించకుండా అవసరమైన అన్ని పత్రాలను సక్రమంగా క్రోడీకరించి కంపెనీ ద్వారా లేదా నేరుగా పీఎఫ్ కార్యాలయంలో సమర్పిస్తే, ఆపదలో ఉన్న కుటుంబానికి సకాలంలో ఈ చట్టబద్ధ సహాయం అందుతుంది.

#EPFO#EPF#EPFO Death Claim#EPF Death Benefits#EPFO Insurance#EDLI Scheme#EPF Withdrawal#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి