KTR: పాలమూరు ముద్దుబిడ్డనని, నల్లమల పులినని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి అన్నదాతల పాలిట ప్రథమ శత్రువుగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత జిల్లాలోనే పంటలు నిలువునా ఎండిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. "ఇక్కడేమో నల్లమల పులిబిడ్డనని గొప్పలు చెప్పుకోవడం.. తీరా ఏపీలో చంద్రబాబు దగ్గరికి వెళ్లేసరికి పిల్లిలా మారిపోవడం రేవంత్‌కే చెల్లింది" అంటూ కేటీఆర్ చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
పొలాల్లోకి కేటీఆర్.. కన్నీరు పెట్టిన రైతులు
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి దశదినకర్మ ముగించుకుని తిరుగుపయనమైన కేటీఆర్ కాన్వాయ్‌ను దేశీ ఇటిక్యాల శివారులో రైతులు ఆపారు. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, తమ గోడు వినాలని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నదాతల ఆవేదన చూసి చలించిపోయిన కేటీఆర్.. వెంటనే వాహనం దిగి స్వయంగా పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సుమారు 40 శాతం పంటలు నీరందక ఎండిపోయాయని, ఇక్కడ దాదాపు 50 శాతానికి పైగా చేలు నాశనమయ్యాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి నాణ్యత కోల్పోయి రంగు మారడంతో మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4 వేలు కూడా రాని దయనీయ స్థితి దాపురించిందని, పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన చెందారు.
కృష్ణా పక్కనున్నా పంటలకు కరవేల
ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు ముందే చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ముందుచూపు ప్రదర్శించలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. "పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా పాలమూరు భూముల్లో పంటలు ఎండబెట్టడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కేసీఆర్ హయాంలో నిరంతర నాణ్యమైన కరెంట్ ఉంటే.. నేడు ఇళ్లలో బల్బులు వెలుగుతున్నా వ్యవసాయ బావుల వద్ద మోటర్లు నడవక రైతులు లబోదిబోమంటున్నారు. అటు రూ.2 లక్షల రుణమాఫీ హామీని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను మోసం చేసింది" అని నిప్పులు చెరిగారు.
రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే
కేంద్ర ప్రభుత్వాన్ని రూ.20 వేల కోట్ల సాయం అడుగుతున్న కాంగ్రెస్ సర్కార్.. వెంటనే పంట నష్టపోయిన రాష్ట్ర రైతులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను సంబంధిత మంత్రులు, వ్యవసాయ అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ అండగా పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అన్నదాతలను నిలువునా ముంచే విధానాలను విడనాడి, ఎకరాకు తగిన పరిహారం చెల్లించి తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.







