ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా.. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో చేయి తడపనిదే పని జరగదనే పరిస్థితి నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రం నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం వరకు.. పహానీలు, మ్యూటేషన్లు, సాదాబైనామా, సర్వేలు, భూ రికార్డుల సవరణలు, కొత్త పాస్‌బుక్స్ జారీ... ఇలా ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధరణిని రద్దు చేసి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి వేలాది దరఖాస్తులు స్వీకరించింది. కానీ నెలలు గడుస్తున్నా... అనేక మంది రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
దీంతో భూమి కోసం రైతు... కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవల జరిగిన రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గజ్వేల్ తహసీల్దార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించగా... కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు బయటపడినట్లు వెల్లడైంది.
అంతేకాదు... సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్... పదకొండు నాలా కన్వర్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి... విధులను పక్కనబెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడాని పేర్కొన్న ఏసీబీ.. ఆయనను అరెస్టు చేసి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
అయితే... ఇలాంటి ఏసీబీ దాడులు ఎన్ని జరుగుతున్నా... రెవెన్యూ కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బందిని మధ్యవర్తులుగా ఉపయోగిస్తూ... ప్రతి పనికీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.
కొత్త రేషన్ కార్డుల జారీ నుంచి... కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల వరకు... కంప్యూటర్ ఆపరేటర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు... డబ్బులు చెల్లిస్తేనే పని త్వరగా పూర్తవుతోందని ప్రజలు చెబుతున్నారు. కొందరికి రోజుల్లో సర్టిఫికేట్ వస్తుంటే... మరికొందరు వారాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
భూముల సర్వేల్లోనూ ఇదే పరిస్థితి. భూవిస్తీర్ణం మార్పులు, హద్దుల నిర్ణయం, కొలతలు... అన్నింటికీ భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లుకు... మామూళ్లు అందితేనే ఫైళ్లకు కదలిక వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆన్‌లైన్‌లో పేరు లేకపోతే భూమిపై హక్కు కోల్పోతామనే భయంతో... రైతులు ఇష్టం లేకపోయినా డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇసుక, ఖనిజ సంపద అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల కబ్జాలు, నకిలీ పట్టాల వ్యవహారాల్లో కూడా రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో చాలామంది తహసీల్దార్లు రెండున్నరేళ్లకు పైగా ఒకేచోట కొనసాగుతుండగా... ఖాళీ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరోవైపు... మెజార్టీ తహసీల్దార్లకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బినామీల పేర్లపై భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
ఒకప్పుడు ప్రజలకు అండగా ఉండాల్సిన రెవెన్యూ వ్యవస్థ... ఇప్పుడు ప్రజలనే వేధించే వ్యవస్థగా మారిందన్న అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతోంది. ప్రజావాణి, కలెక్టరేట్‌లకు వెళ్లే ఫిర్యాదుల్లో అత్యధికం రెవెన్యూ సమస్యలే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బదిలీపై వచ్చిన ఇతర జిల్లాల తహసీల్దార్లు.. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే రెండున్నరేళ్లుగా పాతుకుపోయారు. రిటైర్ అయిన చోట డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు ఇస్తున్నారే తప్ప క్రమబద్ధమైన బదిలీలు లేవు. జిల్లాలోని మెజార్టీ తహసీల్దార్లకు, సర్వేయర్లకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. వీరంతా తమ అక్రమ సంపాదనను బినామీల పేరిట దాచుకున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మొత్తం రెవెన్యూ వ్యవస్థలో 90 శాతం అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఏసీబీ అధికారులు గనుక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే.. మరెన్నో లంచావతారంలు, కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు వెలుగు చూడటం ఖాయం! అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఆక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












