కేంద్రఆర్థిక మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ నియామకం కాబోతున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచిప్రారంభంకానున్నాయి.దానికి ముందే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని ఎన్డీయే సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అధిష్టానం ఇప్పటికే కీలక భేటీలు నిర్వహించింది.
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోడీ, అమిత్ షా వేర్వేరుగా కలిసి కేబినెట్ మార్పులపై చర్చించినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధానికి కీలక సలహాదారుగా ఉన్న శక్తికాంత దాస్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.ఓవైపు పశ్చిమాసియా సంక్షోభం.. ఇతర ఆర్థిక పరమైన ఇబ్బందులు, ద్రవ్యోల్భణం, ఆర్థిక వృద్ధిలో కోత వంటి తదితర పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాలనే ఆలోచనతోనే ఆర్థికశాఖను శక్తి కాంత దాస్‌కు అప్పగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, ప్రస్తుత ఆర్థికమంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ అప్పగించి.. ఆమె స్థానంలో ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యతలను దాస్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.ఇక ‘నీట్ పేపర్’ లీకేజీ క్రమంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయనకు వేరే శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ సారి కేబినెట్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వారికి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.












