బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైనట్లు సమాచారం.
వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిమాన్షు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.
ఆయనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లి హిమాన్షును పరామర్శించారు. మనవడికి గాయమైందన్న సమాచారం అందుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదిలా ఉండగా, తన ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనలకు స్పందించిన హిమాన్షు రావు.. జిమ్‌లో జరిగిన ప్రమాదంలో చిన్నపాటి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరానని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని 'ఎక్స్' వేదికగా తెలిపారు
మరోవైపు కేటీఆర్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, హిమాన్షుకు స్వల్ప గాయమే అయిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












