టోల్‌ఫ్రీ నంబర్ '1950' ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
'ఓటర్ హెల్ప్‌లైన్' యాప్, పోర్టల్ ద్వారా సేవలు
వారాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు
సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన ప్రతీ ఓటరుకు దరఖాస్తు ఫారమ్ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. ఒకవేళ మీ ఇంటికి ఇప్పటివరకు అప్లికేషన్ అందకపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తక్షణమే ఎన్నికల సంఘం అధికారిక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1950 కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులు (BLO) నేరుగా ఓటరు ఇంటికే వచ్చి అప్లికేషన్ అందజేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా.. ఓటరు కార్డులో పేరు, వయస్సు, చిరునామా తప్పుల సవరణలు మరియు ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు.
టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ఓటర్లు నేరుగా 'ఓటర్ హెల్ప్ లైన్' మొబైల్ యాప్ లేదా ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో తమ వివరాలను తనిఖీ చేసుకుని, అవసరమైన ఆధార్, వయస్సు ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. గడువు ముగిసేలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ధృవీకరించుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రత్యేకించి 18 ఏళ్లు నిండిన యువతకు డిజిటల్ పద్ధతుల్లో అవగాహన కల్పించేందుకు కాలేజీలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రతీ శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటారు. దీని ద్వరా ఓటర్లు నేరుగా వెళ్లి తమ ఓటు ఉందో లేదో జాబితాలో సరిచూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మృతుల పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటరు లిస్టును సిద్ధం చేయడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని, గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబడవని అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












