సినిమా

సినిమాను ఎన్‌కౌంటర్ చేయకండి.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

రచన: Desk 33 నిమిషాల పఠనం

బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో, పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సత్లుజ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో, పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సత్లుజ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఐటీ నిబంధనల ఉల్లంఘన, భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను కేవలం రెండు రోజుల్లోనే ప్లాట్‌ఫామ్ నుంచి అకస్మాత్తుగా తొలగించింది. ఈ చిత్రం నిషేధంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

‘సత్లుజ్’ కేవలం సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని, మానని లోతైన గాయాన్ని గుర్తుచేసే అద్భుత దృశ్యకావ్యమని కొనియాడారు. ఇందులో దిల్జీత్ దోసాంజ్ ఎక్కడా హీరోయిజం ప్రదర్శించకుండా కేవలం అంతరాత్మతో నటించారని, సమాజంలోని కుళ్లును ప్రతిబింబించేలా పోలీస్ పాత్రలో అర్జున్ రాంపాల్ భయానక నటనను కనబరిచారని ప్రశంసించారు.

దర్శకుడు హనీ ట్రెహన్ ఈ భీతిగొలిపే వాతావరణాన్ని ఎక్కడా సంచలనాత్మకం చేయకుండా, ఒక స్లో-బర్న్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా అద్భుతంగా మలిచారని ఆర్జీవీ పేర్కొన్నారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ తన పౌరులనే మింగేస్తూ, ఆ సాక్ష్యాలను ఎలా చెరిపేస్తుందో ఉపన్యాసాలు లేకుండా చూపించడం సామాన్యమైన విషయం కాదని వర్మ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ కళ అయినా విజయం సాధించినట్లేనని, ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఆంక్షలే అందుకు నిదర్శనమన్నారు.

వినోదం కోసం పరుగెత్తే నేటి సినిమాల మధ్య ఇదొక నిజాయతీ గల ప్రయత్నమని ఆర్జీవీ కొనియాడారు. సినిమాలో చూపిన బాధితులను ఎన్‌కౌంటర్ చేసినట్లుగా, ఈ చిత్రాన్ని కూడా ఎన్‌కౌంటర్ చేయవద్దని... జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగిన అన్యాయాన్ని సినిమాకు చేయవద్దని అధికారులను కోరుతూ, సత్యాన్ని దాచాలని చూస్తే అది మరింత బలంగా తిరగబడుతుందని ఆర్జీవీ హెచ్చరించారు.

#Satluj#Diljit Dosanjh#Jaswant Singh Khalra#Ram Gopal Varma#Honey Trehan#Movie Ban
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి