మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్యుడు గజగజ వణికిపోతున్నాడు! ఏ వస్తువు ముట్టుకున్నా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులకు ఇప్పుడు గట్టి షాకే తగిలింది. పెరిగిన ధరల దెబ్బకు చికెన్ ముక్క వైపు చూడటానికే భయపడే పరిస్థితి వచ్చింది! గత నెలతో పోలిస్తే కిలో చికెన్‌పై ఏకంగా 40 నుంచి 50 రూపాయలు పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్ చికెన్ కిలో ధర 290 రూపాయలకు చేరింది. వారానికి ఒకసారి కుటుంబంతో కలిసి చికెన్ తిందామనుకునే మధ్యతరగతి ప్రజలు.. ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే కొనేలా ధరలు ఆకాశాన్నంటాయి.
ఇక ఈ ధరల ప్రభావం హోటళ్లపై కూడా పడింది. బిర్యానీలు, చికెన్ కర్రీ ఆర్డర్లు సగానికి సగం తగ్గిపోయాయని హోటల్ యజమానులు లబోదిబోమంటున్నారు. మరోవైపు స్కిన్‌లెస్ చికెన్ కొందామంటే.. కిలో ధర ఏకంగా 320 రూపాయలు పలుకుతోంది! పోనీ పిల్లల కోసం బోన్‌లెస్ చికెన్ తీసుకుందాం అనుకుంటే.. కిలో 380 నుంచి 400 రూపాయల వరకు అమ్ముతున్నారు.
చికెన్ ధరలే ఇలా ఉంటే.. పేదవాడి పౌష్టిక ఆహారం అయిన కోడిగుడ్డు కూడా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది! రికార్డు స్థాయిలో హోల్‌సేల్ మార్కెట్లోనే ఒక గుడ్డు ధర 7 రూపాయల 50 పైసలు పలుకుతుంటే.. రిటైల్ షాపుల్లో 8 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే పది గుడ్లు కొనాలంటే 80 రూపాయలు దాటాల్సిందే.
వేసవి తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడం, దానికి తోడు ఫీడ్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల మంట హోటళ్లు, మెస్‌లకు కూడా పాకింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో చికెన్ బిర్యానీ ప్లేట్‌పై 20 రూపాయలు, చికెన్ మీల్‌పై 15 రూపాయల వరకు పెంచేశారు.
దీంతో రోజువారీ కూలీలు, కార్మికులు బయట తినే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ధరల దెబ్బకు చికెన్ అమ్మకాలు 30 శాతం వరకు పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఫీడ్, మందులు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ధరలు తగ్గించడం తమ చేతుల్లో లేదని పౌల్ట్రీ ఫారాల యజమానులు స్పష్టం చేస్తున్నారు. మరో నెల రోజుల పాటు ధరలు ఇలాగే మండిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా..












