తెలంగాణ

రేవంత్ రెడ్డికి ‘కేసీఆర్ ఫోబియా’.. బీఆర్‌ఎస్ ఎల్పీ విప్ వివేకానంద

రచన: Desk 35 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని, అనాలోచిత, తుగ్లక్ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • అనాలోచిత తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలకు శాపం

  • మెట్రో భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు

  • చేతకాకపోతే కాళేశ్వరం మాకు అప్పగించండి!

  • "ఈఎంఐ ముఖ్యమంత్రి"గా అభివర్ణించిన వివేకానంద

  • ఢిల్లీకి కప్పం కడుతున్నారంటూ ఫైర్

  • హిట్లర్, తుగ్లక్ లా ప్రవర్తించడం మానేయాలంటూ హితవు

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని, అనాలోచిత, తుగ్లక్ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కూల్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు.

హైడ్రా, మూసీ, హిల్ట్ పాలసీలతో నగరంలో విధ్వంసం సృష్టించారని ఇప్పుడు మెట్రో రైలు భవితవ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకంగా మార్చారని వివేకానంద ఆరోపించారు. ఎల్ అండ్ టీ సంస్థతో చేసుకున్న ఒప్పందాల వల్ల ప్రతిరోజూ రూ.2.5 కోట్ల భారం పడుతోందని పేర్కొన్నారు. "బడే భాయ్, చోటే భాయ్ కలిసి మెట్రోను మడతపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రితో సీఎం ఏం చర్చించారో ప్రజలకు బహిరంగపర్చాలి. రాయదుర్గం - ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయకుంటే నగరంలో కనెక్టివిటీ ఎంతో పెరిగేది" అని ఆయన అన్నారు.

తక్కువ జనాభా ఉన్న జైపూర్ లాంటి నగరాల్లో మెట్రో ఫేజ్-2 పనులు చకచకా సాగుతుంటే, కోటి 30 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌కు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని "ఈఎంఐ ముఖ్యమంత్రి"గా అభివర్ణించిన వివేకానంద.. నెలకోసారి ఢిల్లీకి కప్పం కట్టేందుకు వెళ్లినా ఈ పాటికి 31 సార్లు వెళ్లాలని, కానీ రేవంత్ ఏకంగా 73 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయన్నారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని, రేవంత్ రెడ్డికి ఇంకా 29 నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని హెచ్చరించారు. "కేసీఆర్ ఆర్థిక విధానాల వల్ల తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకే చెప్పింది. కానీ రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది" అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మెయింటనెన్స్ చేతకాకపోతే బీఆర్‌ఎస్‌కు అప్పగించాలని సవాల్ విసిరారు.

కేసీఆర్ నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేస్తే, మేడిగడ్డ పిల్లర్ల రిపేర్లకే ఈ ప్రభుత్వానికి 39 నెలలు పడుతుందా? అని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు బీఆర్‌ఎస్ బృందం వస్తుందని, కాంగ్రెస్ నేతలు కూడా రావాలని.. ధైర్యముంటే నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు ఇద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ జీవోలు ‘ఏపీ’ (ఆంధ్రప్రదేశ్) పేరుతో రావడం కంటే దిక్కుమాలినతనం మరొకటి లేదని, అసలు సంబంధిత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హిట్లర్, తుగ్లక్ లా ప్రవర్తించడం మానేసి, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని హితవు పలికారు.

#RevanthReddy#KPVivekanand#BRSPressMeet#HyderabadMetro#KaleshwaramProject#TelanganaPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి