తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధారణ కానిస్టేబుల్‌గా సర్వీస్‌లో చేరి, రాతపరీక్ష ద్వారా ఎస్సైగా ఎంపికై డీఎస్పీ స్థాయికి ఎదిగిన భీమ్‌రెడ్డి.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు అంటే అది ఆషామాషీ వ్యవహరం కాదనే విమర్శలున్నాయి. ఇక కేసు విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.. భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ఆఫీస్‌కు తరలించి.. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుటహాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైలుకు తరలించారు.
మొదట్లో చిన్నస్థాయిలో అక్రమాలకు తెరలేపిన భీమ్ రెడ్డి, రానురానూ తన పరిధులు పెంచుకుంటూ పోయాడు. లంచాలు, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం.. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కనకవర్షం కురిపించుకున్నాడు. అయితే, పాపం పండక మానదు అన్నట్టు.. భీమ్ రెడ్డి లీలలపై అవినీతి నిరోధక శాఖ (ACB) నిఘా పెట్టింది. పక్కా ప్లాన్‌తో దాడి చేసిన ఏసీబీ అధికారులకు.. భీమ్ రెడ్డి ఇంట్లో, అతని బినామీల పేరిట ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లు చూసి మైండ్ బ్లాంక్ అయింది.
కళ్ళు చేదిరిపోయేలా బయటపడిన ఆయన ఆస్తుల వివరాలు చూస్తే.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం.. సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాంనగర్, ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ విల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల ఎకరాల వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు భీమ్‌రెడ్డి తన దగ్గర పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్‌ల పేరిట కూడా కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వీటితో పాటు నిందితుడి ఇళ్ల నుంచి రూ.43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. లీగల్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికే ఇతరుల పేర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బినామీ లావాదేవీలపై ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
అలాగే ఈ కేసులో ఒక ఎన్‌ఆర్‌ఐ బంధువు, మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి, సిటీకి చెందిన దంపతుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. గతంలో కూడా గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనూ భీమ్‌రెడ్డి పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఈ కేసు.. ఈడీ దృష్టిని కూడా ఆకర్షించబోతుందనే ప్రచారం మొదలైంది. ఈ వార్తలతో భీమ్ రెడ్డి కి చుట్టూ బిగుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ కేసు విషయంలో ఏసీబీ ఈడీకి లెటర్ రాసిందనే ప్రచారం జరుగుతుంది.
లంచం ఆరోపణలతో మొదలైన ఈ కేసు... ఇప్పుడు ఆస్తుల కోణంలో కూడా విచారణకు దారితీసే అవకాశాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఏసీబీ సేకరించిన వివరాలను ఈడీకి పంపినట్లు సమాచారం రావడంతో... ఈ వ్యవహారం కేవలం అవినీతి నిరోధక కేసుగానే కాకుండా, మనీలాండరింగ్ కోణంలోనూ పరిశీలనకు వచ్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
భీమ్ రెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత... ఆయనకు సంబంధించిన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై ఉన్న పెట్టుబడుల గురించి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
విచారణ సంస్థలు ప్రధానంగా పరిశీలించే అంశం ఒక్కటే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? ఉంటే వాటికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్తులు ఎవరి పేర్లలో ఉన్నాయి? అసలు యజమాని ఎవరు? లావాదేవీల వెనుక ఉన్న ఆర్థిక మార్గాలు ఏమిటి? అన్న కోణాల్లో ఆధారాలను సేకరించే అవకాశం ఉంటుంది.
ఇక ఈడీ ఎంటరైతే విచారణ స్వరూపమే మారుతుంది. ఏసీబీ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తే... ఈడీ మాత్రం అక్రమంగా సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది? దాన్ని ఎలా పెట్టుబడులుగా మార్చారు? ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది? అనే అంశాలపై దృష్టి పెడుతుంది.
బ్యాంక్ స్టేట్‌మెంట్లు... రిజిస్ట్రేషన్ పత్రాలు... కంపెనీల వివరాలు... ఆదాయపు పన్ను రికార్డులు... డిజిటల్ లావాదేవీలు... అవసరమైతే సెల్‌ఫోన్ డేటా కూడా విచారణలో భాగమయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద 300 కోట్ల అక్రమ ఆస్తులను ఈడీ జప్తు చేసే అవకాశం ఉంది. రాజకీయ అండదండలు ఉన్నా, ఎంతటి పెద్దవారైనా సరే.. ఈడీ ఉచ్చు నుండి తప్పించుకోవడం అసాధ్యం. మరి ఈ 300 కోట్ల సామ్రాజ్యం వెనుక ఇంకా ఎంతమంది పెద్దల హస్తం ఉందో? ఈ బినామీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!












