రాజకీయాలు

కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. కడియం వ్యవహారంపై కొండా సురేఖా ఫైర్!..

రచన: Desk 25 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు మరోసారి తెరలేచింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ వ్యవహారం కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరడం చర్చాంశనీయంగా మారింది.

ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లు, నిధుల కేటాయింపులు, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతేకాదు... అధికారులకు గడువులు కూడా నిర్దేశించినట్లు తెలుస్తోంది.

అయితే... దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఈ మొత్తం వ్యవహారం పై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడమే వివాదానికి కారణమైంది. సంబంధిత శాఖా మంత్రిని పూర్తిగా పక్కనబెట్టి అధికారులతో సమీక్ష ఎలా నిర్వహిస్తారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు పేజీల అధికారిక లేఖ రాశారు. అందులో కడియం శ్రీహరి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిపాలనా విధానాలను, మంత్రి అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేస్తూ సమీక్షలు నిర్వహించడం పై ఆరోపణలు చేశారు.

దేవాదాయ శాఖకు సంబంధించిన విధాన నిర్ణయాలు, పరిపాలనా సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ పూర్తిగా సంబంధిత శాఖా మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలని ఆమె స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే, అధికారిక సమావేశాలు నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడం, గడువులు విధించడం పరిపాలనా వ్యవస్థలో అనుచిత పరిణామాలకు దారితీస్తుందని లేఖలో పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం శ్రీహరికి ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో బాగా తెలుసని, అయినప్పటికీ మంత్రిని పక్కనపెట్టి వ్యవహరించడం వెనుక ఉద్దేశమేంటనే ప్రశ్నను పరోక్షంగా లేవనెత్తారు.

ఇటువంటి చర్యలు కొనసాగితే ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయం దెబ్బతినే ప్రమాదం ఉందని, అధికారులు ఎవరి ఆదేశాలు పాటించాలనే అయోమయంలో పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

అంతేకాదు... ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని, కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలని, పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడు ఈ లేఖ కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందా? లేక ఇది అధికార పరిధిపై ఏర్పడిన విభేదమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం పరిపాలనపై దృష్టి సారిస్తున్న సమయంలో... మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య అధికారాలపై వివాదం తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారు? కడియం శ్రీహరి నుంచి వివరణ కోరుతారా? లేక ఈ వివాదానికి పార్టీ స్థాయిలోనే ముగింపు పలుకుతారా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

#telangana#kadiyam-srihari#konda-surekhas#cm revanth reddy#Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి