రాష్ట్ర పరిపాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి డిజిటల్ గవర్నెన్స్ అమలు కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించి, అవసరమైన చోట కొత్త చట్టాలను తీసుకురావాలని సూచించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించారు. ప్రభుత్వ సేవలు వేగంగా ప్రజలకు చేరాలంటే, సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా అర్హులకు అందాలంటే డిజిటల్ వ్యవస్థే పరిష్కారమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల మొదటి తేదీన లేదా ఐదో తేదీలోపు జీతాలు అందేలా పూర్తి సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల వివరాలు, వేతనాలు, బ్యాంకు ఖాతాల సమాచారం మొత్తం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో నాలుగు వేల మూడు వందల ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు వివరించారు. అంతేకాదు, ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించని ఘటనలు కూడా వెలుగు చూశాయి.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ప్రతి చెల్లింపును ట్రాక్ చేసి, ఉద్యోగుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ వంద రోజుల్లో నివేదిక సమర్పించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేసి, హెల్త్ కార్డులు సహా అన్ని సంక్షేమ ప్రయోజనాల అమలు సులభతరం చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి చెల్లింపుతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మొత్తానికి... డిజిటల్ గవర్నెన్స్‌తో అవినీతికి అడ్డుకట్ట, ఉద్యోగులకు సకాలంలో జీతాలు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశంసలు అందుకుంటుంది.












