అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్..
కార్పొరేట్ స్థాయిలో హంగులు..
అడిగినంత ఫీజులు!..
లోపల జరుగుతున్నది చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..
హైదరాబాద్ లోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫుడ్ మాఫియా గుట్టు రట్టయింది. లక్షల ఫీజులు వసూలు చేస్తూ.. పిల్లల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారో చూసిన తల్లిదండ్రులు నివ్వెరపోయారు!
షేక్‌పేట్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఆహారం సరఫరా చేస్తున్న D$D క్యాటరింగ్ సర్వీసెస్ కిచెన్‌పై పేరెంట్స్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అక్కడ కనిపించిన పరిస్థితులు వారిని ఆందోళనకు గురి చేశాయి.
పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వంటగది... చుట్టూ ఈగలు, దోమలు... పరిశుభ్రత ప్రమాణాలు కనిపించని వాతావరణంలో పిల్లలకు ఆహారం సిద్ధం చేయడం పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు... వంటకు, తాగునీటికి కూడా క్లోరినేషన్ చేయని బోర్ వాటర్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు... ఈ స్కూల్లో ఫీజులను చూస్తే గుండె దడ రావడం ఖాయం.. ఏడాదికి సుమారు రూ. 6 లక్షల 50 వేల ఫీజుతో పాటు, కేవలం ఆహారం కోసమే అదనంగా రూ. 60 వేల వరకు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ చెబుతున్నారు.
పిల్లల చదువులకు లక్షలు ఖర్చు చేస్తున్నా... వారికి అందుతున్న ఆహారం నాణ్యత మాత్రం అత్యంత దారుణంగా ఉండటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ పేరుతో పేరెంట్స్ నమ్మకాన్ని పొందుతున్న స్కూల్... పిల్లల భోజన విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పైన పటారం లోన లోటారం సామెతను గుర్తుకు తెస్తుందని మండిపడుతున్నారు.
ఇలాంటి ఆహారం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరు తీసుకుంటారని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత క్యాటరింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని... అవసరమైతే కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












