ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను రాబట్టడమే ధ్యేయంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆయన సియోల్ నుంచి ఆ దేశ ప్రముఖ వాణిజ్య నగరం బుసాన్‌కు రైలులో ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా బుసాన్ వేదికగా ఈరోజు ఆయన పలు కీలకమైన అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు.
ఈ ఉదయం బుసాన్‌లో 'ఏపీఈడీబీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అపెక్స్-కొరియా' విభాగాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా పారిశ్రామికవేత్తలకు ఒక సహాయక, అనుసంధాన కేంద్రంగా సేవలందిస్తుంది. అనంతరం కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (KOMEA) నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, ఏపీలో ఉన్న అనుకూలతలు, పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
మధ్యాహ్నం బీఎన్‌కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్, హ్యుంగ్ సాంగ్ గ్రూప్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం స్థానిక 'షూఆల్స్ ఫుట్‌వేర్' ఫ్యాక్టరీని సందర్శించి, అక్కడ తయారీ రంగ విశేషాలను పరిశీలిస్తారు. బుసాన్‌లో తన పర్యటన ముగిసిన అనంతరం రాత్రికి తిరిగి సియోల్ చేరుకుంటారు.












