రాజకీయాలు

దిగి వచ్చిన కేంద్రం.. ఫలించిన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం..

రచన: Desk 25 నిమిషాల పఠనం

తెలంగాణ అభి వృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలించింది. సింగరేణి మనుగడను మరో 40 సంవత్సరాల పాటు సుస్థిరం చేస్తూ... "తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్"ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి సింగరేణి అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దేశ ప్రధానమంత్రిని కలిసి తాడిచర్ల బ్లాక్ కేటాయింపు కోసం తన గళం వినిపించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందిస్తూ... ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగరేణి అభివృద్ధే లక్ష్యంగా కొత్త బొగ్గు గనుల సాధన కోసం నిరంతరంగా కృషి చేశామని తెలిపారు. ఆ ప్రయత్నాల ఫలితంగానే తాడిచర్ల–2 బ్లాక్ సింగరేణికి దక్కిందని పేర్కొన్నారు.

2024 మార్చిలో అప్పటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసి ఈ బ్లాక్ కేటాయించాలని కోరినట్లు భట్టి గుర్తు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన బొగ్గు బ్లాకుల వేలం సందర్భంగా, అలాగే నవంబర్‌లో మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల మే నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించినట్లు వెల్లడించారు.

అంతేకాదు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తాడిచర్లతో పాటు ఇతర బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

తాడిచర్ల–2 బ్లాక్‌లో మొత్తం 434.14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అందులో సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ లభించే జీ-9 గ్రేడ్ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడనుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భూపాలపల్లి ప్రాంతంలో రోడ్లు, రైల్వే, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఇది ఊతమివ్వనుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగం, విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక బొగ్గు సరఫరా కూడా జరుగుతుంది.

గతంలో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు పెండింగ్‌లో ఉన్న అనుమతులను తమ ప్రభుత్వం సాధించి, అక్కడ ఉత్పత్తిని ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడు తాడిచర్ల–2 బ్లాక్ కూడా సింగరేణికి దక్కడంతో సంస్థ భవిష్యత్ విస్తరణకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

ప్రజా ప్రభుత్వ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి తాడిచర్ల–2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి భవిష్యత్తుకు భరోసానిచ్చిన ప్రజా ప్రభుత్వం... రాబోయే రోజుల్లో మరిన్ని బొగ్గు బ్లాకులను సాధించే దిశగా ముందుకు సాగుతోంది.

#Telangana#Tadicherla block#Singareni#congress#revanthreddy#modi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి