డిజిటల్ రాజకీయాల కొత్త అధ్యాయం
మారుతున్న రాజకీయ సమీకరణాలు!
ట్రెండ్‌ను అర్థం చేసుకుంటేనే ఆధిపత్యం
ఒకప్పుడు వాట్సాప్ సునామీ.. ఇప్పుడు రీల్స్, మీమ్స్ ప్రభావం!
పాత ప్రచార వ్యూహాలకు కొత్త తరం నుంచి సవాళ్లు
భారత రాజకీయాల్లో కమలం పువ్వు వికసించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అయితే, నాటి సమాచార విప్లవానికి, నేటి పరిస్థితులకు మధ్య ఒక తరం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చిన ఊపు బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడితే.. నేటి కొత్త తరం వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ట్రెండ్స్ ఆ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి.
హిందూత్వ భావజాలాన్ని ఈజీగా అంగీకరించిన నాటి 'వాట్సాప్ జనరేషన్' వేసిన పునాదులను, నేటి జెన్‌జీ (Gen Z) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొత్త ఆలోచనలతో ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో అధికార పక్షం ఆరితేరిపోయింది. కాలేజీ గ్రూపుల నుంచి ఫ్యామిలీ గ్రూపుల దాకా ప్రతిచోటా కథనాలను వ్యాప్తి చేసి, తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగారు. కానీ, ఇప్పటి యువత ఆ పాత వేదికలను పక్కనపెట్టి ఇన్‌స్టా , స్నాప్‌చాట్ వైపు మళ్లారు.
దాంతో, పాత ఐటీ సెల్ పద్ధతులు ఈ కొత్త తరం దగ్గర అనుకున్నంతగా పనిచేయడం లేదనే చర్చ మొదలైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వాళ్లు అస్సలు పట్టించుకోరు. పోనీ పిల్లలు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉన్నారని తెలిసి, అక్కడ వాళ్లను వెతికి పట్టుకుందామంటే అసలు దొరకనే దొరకరు. ఇళ్లల్లో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న ఈ డిజిటల్ గ్యాపే.. నాటి సంప్రదాయ రాజకీయ ప్రచారానికి, నేటి యువత ఆలోచనలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది.
పాతకాలపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మెసేజ్ పంపితే జనాలు దాన్ని నిశ్శబ్ధంగా చదివేవారు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం వేరు. అది రీల్స్, మీమ్స్, విజువల్స్‌తో నిండిపోయింది. ఇది కేవలం సమాచారం చూసే చోటు మాత్రమే కాదు, నిమిషాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే ఒక తిరుగుబాటు వేదిక. ఇక్కడ యువతకు హద్దుల్లేని స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం ఎక్కువ. అందుకే సాధారణ ఐటీ సెల్ మార్కెటింగ్ ఇక్కడ వర్కవుట్ కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
మారిన డిజిటల్ యుగంలో కేవలం పాతకాలపు ప్రచారాల మీద ఆధారపడితే నడవదు. కంటికి ఇంకేలా, వినోదాత్మకంగా, వేగంగా ఆలోచించే నేటి యూత్‌ను ఆకట్టుకోవాలంటే వాళ్ల స్టైల్లోనే మాట్లాడాలి. పాత భావజాలాన్ని రుద్దడం పక్కనపెట్టి, నేటి యువత ఆకాంక్షలకు, వారి ఆలోచనలకు తగ్గట్టు మారినప్పుడే డిజిటల్ రాజకీయంలో ఎవరైనా ముందంజలో ఉండగలరు అనడంలో ఎలాంటి సందేహంలేదు.












