నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.వారిమీద పోలీసులు,బలగాలు దాడులు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోలీసు దాడులను ఖండిస్తూ సీజేపీ లాయర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్తానం విచారణ చేపట్టింది.ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును యూపీఏ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు.
నీట్ (NEET) పేపర్ లీక్ అక్రమాలకు వ్యతిరేకంగా విద్యా సంస్కరణలు, ప్రభుత్వ జవాబుదారీతనం కోరుతూ ఆందోళనకు దిగిన విద్యార్థుల పట్ల కేంద్రం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) అధినేత్రి సోనియా మండిపడ్డారు.ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న దేశ యువత ధైర్యానికి మోడీ ప్రభుత్వం పిరికిపంద చర్యలు, తీవ్రమైన క్రూరత్వంతో సమాధానమిస్తోంది.
విద్యార్థులు దేశ భవిష్యత్‌ను నిర్మించే వారసులుగా కాకుండా ‘దేశ శత్రువులు’గా గుర్తిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తోంది. మోడీ ప్రభుత్వం దేశ విద్యా రంగాన్ని తీవ్రంగా దిగజార్చింది. బాధ్యతారాహిత్యం, అధికార మోహం, పరమ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులకు అండగా నిలబడి వారి భవిష్యత్‌ను కాపాడటం మనందరి నైతిక, రాజకీయ, రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక బాధ్యత’ అని సోనియా పేర్కొన్నారు. కాగా,నేడు సీజేపీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.












