దేశీయ స్టాక్ మార్కెట్లను చమురు మంటలు ఆగం చేస్తున్నాయి. ఫలితంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేటి ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగడం, అమెరికా కొత్తగా విధించిన టారిఫ్‌ల ప్రభావం.. ఇలా పలు ప్రతికూల పరిణామాలు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 715 పాయింట్లు నష్టపోయి 75,675 స్థాయిలో ట్రేడయ్యింది. మరోవైపు నిఫ్టీ 198 పాయింట్లు పడిపోయి 23,671 వద్ద కొనసాగింది. దీంతో క్షణాల వ్యవధిలోనే దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. వరుసగా ఆరో సెషన్‌లోనూ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల మార్క్‌ను దాటింది. ఒక్క నెల వ్యవధిలోనే ముడి చమురు ధర దాదాపు 40 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి వ్యయం పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం, కంపెనీల నిర్వహణ ఖర్చులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లలో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీల దాడుల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రతరం కావడం.. వరుసగా ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
మరోవైపు వాణిజ్య రంగంలోనూ అమెరికా తీసుకున్న తాజా నిర్ణయాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. భారత్ సహా దాదాపు 60 దేశాలపై అమెరికా 10 నుంచి 12.5 శాతం వరకు సుంకాలు విధించడం ఆందోళనకు కారణమైంది. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. భారీగా షేర్లను విక్రయిస్తున్నారు.
నిఫ్టీలో సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హిందాల్కో, ఇండిగో వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలపై మార్కెట్ల దృష్టి ఉండటంతో.. ముడి చమురు ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి..












