National

తగ్గేదేలే..! ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీకి ఫుల్ క్లారిటీ

రచన: Kashi9 నిమిషాల పఠనం

కానిస్టిట్యూష‌న్ క్ల‌బ్ వేదిక‌గా కేంద్ర మంత్రులు, సీజేపీ ప్ర‌తినిధులు మ‌రికొద్ది గంట‌ల్లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో కూడా కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామానే మెయిన్ ఎజెండాగా నిల‌వ‌నుంది. ఈ విష‌యంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌చ్చు. సీజేపీ కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి చ‌ర్చ‌ల ద్వారా కూడా ఏం తేల‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

కొద్ది గంట‌ల్లో ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌నుంది..?

కేంద్రంతో చ‌ర్చ‌ల్లో సీజేపీ ప్ర‌ధాన డిమాండ్ ఏంటి..?

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా అంశంపై పీఠ‌ముడి

ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న దేశం

అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. విద్యారంగంలో సంస్క‌ర‌ణలు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేప‌ట్టిన సామాజిక కార్య‌క‌ర్త‌ సోనం వాంగ్‌చుక్ దీక్ష విర‌మించారు. పేపర్‌ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పారు. ఉద‌యం ఓ వీడియో కూడా విడుద‌ల చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీ, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో విస్తృత స్థాయి సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చింద‌ని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మం మొద‌లుపెట్టిన త‌ర్వాత దీనినో కీల‌క ప‌రిణామంగా భావించ‌వ‌చ్చు. అయితే వాంగ్‌చుక్ వీడియోలో ఎక్క‌డా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ప్ర‌స్తావ‌న రాలేదు. దీంతో సీజేపీ కార్య‌క‌ర్తల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ స్టాండ్ క్లియ‌ర్

సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్ష విర‌మించినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు సీజేపీ ఫౌండ‌ర్ అభిజీత్ దీప్కే. అదే స‌మ‌యంలో త‌మ డిమాండ్ల‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేంతవరకు జంతర్‌ మంతర్‌ వద్ద తమ ఆందోళన కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు. ఈ విషయంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని తేల్చిచెప్పారు. ఫ‌స్ట్ ఈ డిమాండ్‌ను నెర‌వేర్చండి. ఆ త‌ర్వాత మిగిలిన విష‌యాలు మాట్లాడుకుందామ‌ని ప్ర‌క‌టించారు. అటు కేంద్రం మాత్రం ఇంకా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. చివ‌రి దాకా ఆయ‌న రాజీనామాలేకుండానే.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌నేది మోదీ వ్యూహంగా తెలుస్తోంది. కానీ.. కాక్రోచ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఈ విష‌యంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు.

త‌టస్థ వేదిక‌పైనే చ‌ర్చ‌లు

చ‌ర్చ‌ల విష‌యంలో కేంద్ర‌మే ఓ మెట్టు దిగింది. మంత్రుల నివాసాలు, కార్యాల‌యాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో చ‌ర్చ‌ల‌కు తాము అంగీక‌రించ‌బోమ‌ని సీజేపీ చెబుతూ వ‌చ్చింది. ఏం మాట్లాడినా జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్దే అని తేల్చిచెప్పింది. లేదంటే ఏదైనా త‌ట‌స్థ వేదిక‌ల‌పై మాట్లాడాల‌ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీక‌రించింది. కానిస్టిట్యూష‌న్ క్ల‌బ్ వేదిక‌గా కేంద్ర మంత్రులు, సీజేపీ ప్ర‌తినిధులు మ‌రికొద్ది గంట‌ల్లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో కూడా కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామానే మెయిన్ ఎజెండాగా నిల‌వ‌నుంది. ఈ విష‌యంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌చ్చు. సీజేపీ కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి చ‌ర్చ‌ల ద్వారా కూడా ఏం తేల‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

సీజేపీ ఫౌండ‌ర్ అభిజీత్ దీప్కే, పార్టీ అధికార ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. చ‌ర్చ‌లు ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగినా.. కేంద్రం ముందు తాము పెట్టే డిమాండ్ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామానే అని తేల్చిచెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలో ఇవాళ్టి చ‌ర్చ‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

వాంగ్‌చుక్ ద్వారా కేంద్రం ప్ర‌య‌త్నాలు

సోనమ్ వాంగ్‌చుక్ ద్వారా సీజేపీ నాయ‌కుల‌ను ఒప్పించాల‌నే ప్లాన్‌లో ఉంది కేంద్రం. ఆయ‌న‌తో దీక్ష విర‌మింప‌జేసిన ప్ర‌భుత్వం.. ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అయితే ఆయ‌న కూడా ఇందుకు అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ దీక్ష మొద‌లుపెట్టిందే వాంగ్‌చుక్. అలాంట‌ప్పుడు మీరు వెన‌క్కి త‌గ్గండ‌ని సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న‌ ఎలా చెబుతారు..?

ప్ర‌ధాని వీడియోకు రాహుల్ కౌంట‌ర్

పేపర్‌ లీక్‌ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలుంటాయని ప్రధాని మోదీ నిన్న అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. లీక్‌ల‌కు చెక్ పెట్టేలా ఓ క‌ఠినమైన బిల్లును తెస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇవాళ్టి కేబినెట్ భేటీలోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అంతేకాదు.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పార్ల‌మెంటులో బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మోదీజీ.. మన విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో మీరు వారిని అవమానించకండి. యువతకు క్షమాపణలు చెప్పి.. వారిపై దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోండి అని రాహుల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కేంద్రం వ్యూహాలు, విప‌క్షాల ప్ర‌తివ్యూహాలు, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌ల మ‌ధ్య ఇవాళ్టి చ‌ర్చ‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. మ‌రికొద్ది గంట‌ల్లో జ‌ర‌గ‌బోయే చ‌ర్చ‌ల్లో ఏం తేలుతుందా అని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

#Dharmendra Pradhan resignation#NEET protest#CJP protest#Sonam Wangchuk#Rahul Gandhi#Modi government
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి