విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటలను ధ్వంసం చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును దారికి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వయంగా పూలమాలలు వేసి, చెరుకు గెడలను ఆహారంగా తినిపించి ఆపరేషన్ విజయం సాధించాలని వీడ్కోలు పలికారు. పలమనేరు నుంచి బయలుదేరిన ఈ ఏనుగులను మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని 'గుచ్చిమి క్యాంపు'నకు తరలించనున్నారు. జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి క్లిష్టమైన వైల్డ్ ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉండటంతో, అటవీ అధికారులు మొదట వీటినే రంగంలోకి దించి అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ ఆపరేషన్ సందర్భంగా అటవీశాఖ అధికారులకు పవన్ కల్యాణ్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగులు నిరంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నందున, వెంటనే ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏనుగుల దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైతే ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను సైతం రప్పించేలా చర్చలు జరపాలని స్పష్టం చేశారు.
సరిహద్దు చర్చలు పూర్తయ్యేలోగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'జయంత్-అభిమన్యు'ల సహాయంతో జనవాసాలు, పంట పొలాల్లోకి వచ్చిన అడవి ఏనుగులను వీలైనంత త్వరగా తిరిగి దట్టమైన అడవుల్లోకి మళ్లించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు, గిరిజనుల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఈ ఏనుగుల ముప్పు నుంచి స్థానిక ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలిగిస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.












