భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల తుపాను సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజులకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే నిరాశపరిచినప్పటికీ, ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను చెండాడి కేవలం 18 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్సర్లతో) హాఫ్ సెంచరీ బాది ప్రపంచ రికార్డుల మోత మోగించాడు.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర పుటలకెక్కాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌పై 16ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన 37ఏళ్ల నాటి సుదీర్ఘ రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది, ముస్తాక్ మహ్మద్ వంటి దిగ్గజాలను కూడా దాటుకుని అగ్రస్థానానికి చేరుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డునూ సూర్యవంశీ తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు జిబ్రాల్టర్‌కు చెందిన లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండగా, టీ20 ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాల పరంగా ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉండేది. వీరందరి రికార్డులను చెరిపేస్తూ 15 ఏళ్లకే వైభవ్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు.
అసోసియేట్ దేశాల ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 50 ప్లస్ స్కోరు చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) పేరిట ఉన్న ఘనతను కూడా అధిగమించి, భారత క్రికెట్‌లో తనకంటూ ఒక బంగారు అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. వైభవ్ సాధించిన ఈ సంచలనంపై ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.












