ప్రజాస్వామ్య దేశంలో విద్యావ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 'యాంటీ నేషనల్' అని ముద్ర వేస్తారా? అంటూ ఆవేదనతో విద్యార్థి లోకం గళమెత్తింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో జరిగిన అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు, బాధితులు భారీ నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పులు జరిగితే నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. "విదేశీ పర్యటనలు పక్కనపెట్టి ముందు మన దేశ ప్రజలకు, విద్యార్థులకు ఏం కావాలో ప్రధాని మోదీ ఆలోచించాలి. కేంద్ర మంత్రులకు దమ్ముంటే ఒక్కసారి నీట్ పరీక్ష రాసి చూడాలి, అప్పుడే మా పడుతున్న బాధ ఏంటో అర్థమవుతుంది. తప్పులు జరిగినప్పుడు బయటకు వచ్చి ఒప్పుకునే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదు. సొంత సమాధానాలు లేకనే ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ యాంటీ నేషనల్‌గా చిత్రీకరిస్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విద్యార్థులపై నిందలు వేసేవారే నిజమైన దేశద్రోహులు. బీజేపీ తమ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులిచ్చి విద్యార్థులపై విషప్రచారం చేయిస్తోంది" అని ఆమె నిప్పులు చెరిగారు.
మరో విద్యార్థి మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ.. "ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం దారుణం. ప్రశ్నించే వారిని అణచివేయడానికి లాఠీఛార్జ్ పేరిట గూండాగిరి చేస్తున్నారు. బయట నుంచి ఏవో విదేశీ ఫండింగ్‌లు వస్తున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తే ఈ వర్షంలో రోడ్లపై ఎందుకు తడుస్తాం? ఎల్బీ స్టేడియం లాంటి పెద్ద వేదికలు అద్దెకు తీసుకుని ధర్నా చేస్తాం కదా! విద్యార్థులే సొంతంగా డబ్బులు వేసుకుని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న వారికి ఆహారం పంపుతున్నారు" అని వివరించారు.
పరీక్షల పేరిట జరుగుతున్న దారుణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కన్నీరుమున్నీరవుతూ రోడ్లపైకి వస్తున్నారని ధర్నాలో పాల్గొన్నవారు ఆందోళన వ్యక్తం చేశారు. "మా పిల్లలు చనిపోయారు.. రేపు ఇంకొకరి పిల్లలు బలి కాకూడదు" అంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోందని విద్యార్థిని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తప్పులు చేస్తే ప్రజలు కచ్చితంగా నిలదీస్తారనే భయం పాలకుల్లో ఉండాలని, చదువురాని నేతలు అధికారంలో ఉండటం వల్లే విద్యార్థుల ఆవేదన వారికి పట్టడం లేదని మండిపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పాత్రపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మీడియా సంస్థలు కేంద్రం దగ్గర లబ్ధి పొంది మౌనంగా ఉండిపోయాయని, కనీసం సోషల్ మీడియా, యూట్యూబర్లు మాత్రమే తమ ఆవేదనను సమాజానికి చూపిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ దాకా సాగుతున్న పోరాటానికి హైదరాబాద్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోందని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ నిరసన దిశను ఆపేదే లేదని స్పష్టం చేశారు.












