తెలంగాణ

యోగి అండతో రాజాసింగ్‌కు కొత్త అవకాశం..? బీజేపీ నిర్ణయమే కీలకం

రచన: Kashi9 నిమిషాల పఠనం

యూపీ సీఎం యోగి ఆధిత్య‌నాథ్‌తో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రూ క‌ర‌డుగ‌ట్టిన హిందుత్వ వాదులే. అందుకే యూపీలో జ‌రిగే హిందూ స‌మ్మేళ‌నాల‌కు హాజ‌ర‌వుతుంటారు రాజాసింగ్. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందూత్వ వర్గాల్లో విస్తృతమైన పాపులారిటీ, క్రియాశీల ఫాలోయింగ్ ఉంది.

ఫైర్ బ్రాండ్‌కు పార్టీలో నో ఛాన్స్

తెలంగాణ బీజేపీలోకి వ‌ద్దామ‌నుకున్నా.. నో ఆప్ష‌న్

రాజాసింగ్ అడుగులు ఎటువైపు..?

ఆయ‌న హిందుత్వ సిద్ధాంతానికి ఏకైక వేదిక బీజేపీ ఒక్క‌టే

బీజేపీలో ఆయ‌నో ఫైర్ బ్రాండ్. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా.. ఇక్క‌డి కంటే మహారాష్ట్ర‌, యూపీలోనే ఆయ‌న‌కు అభిమానులు ఎక్కువ‌. అలాగ‌ని ఇక్క‌డ ఫాలోయింగ్ లేదా అంటే.. అద్భుతంగా ఉంది. హైద‌రాబాద్ గోషామ‌హ‌ల్ ఆయ‌న‌కు పెట్ట‌ని కోట‌. ఆయ‌నే బీజేపీ నుంచి గెలిచి, ప్ర‌స్తుతం పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయ‌న బీజేపీ నుంచి గెలిచార‌ని చెప్పుకుంటున్నాం కానీ.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెల‌వ‌గ‌లిగే స‌త్తా ఉన్న నాయ‌కుడు. ఇండిపెండెంట్‌గా కూడా రికార్డు సృష్టించ‌గ‌ల‌రు.

అలాంటి క‌రడుగ‌ట్టిన హిందుత్వ వాదికి ఇప్పుడు బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు తిరుగులేకున్నా... బీజేపీలోకి ఎంట‌ర‌య్యేందుకు మార్గం క‌నిపించ‌డం లేదు. గతంలో రాష్ట్ర నాయకత్వ ఎంపికతో పాటు పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి చెంది ఆవేశంతో నిర్ణ‌యం తీసుకున్నారు రాజాసింగ్. బీజేపీకి రాజీనామా చేసి దూర‌మ‌య్యారు. క్రమశిక్షణే ప్రాతిపదికగా పనిచేసే కమలం పార్టీ ఇప్పుడు ఆయ‌న‌కు నో చెబుతుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అప్ప‌ట్లోనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం, ఆయన లేవనెత్తిన అంశాలు అసంబద్ధమైనవి అని తేల్చిచెప్పడంతో తెలంగాణ బీజేపీలోకి ఆయ‌న ఎంట్రీని అడ్డుకుంటున్నాయ‌ట‌.

టార్గెట్ తెలంగాణ బీజేపీ

తెలంగాణ బీజేపీలోకి ఎంట్రీ సాధ్యం కాక‌పోవ‌డంతో మాట‌ల ఫోర్స్‌ను మ‌రింత పెంచారు రాజాసింగ్. మొన్నా మ‌ధ్య కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్, ఎంపీ ఈటెల రాజేంద‌ర్ క‌లిసిపోయార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో రాజాసింగ్ స్పందించారు. ఇద్ద‌రు సీనియ‌ర్లు క‌లిస్తే పార్టీ అధికారంలోకి వ‌స్తుందా అని ప్ర‌శ్నించారు. మిగిలిన నాయ‌కుల‌ను కూడా ప‌ట్టించుకోవాలి క‌దా అని స‌ల‌హాలిచ్చారు. ఆ స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభ‌య్ పాటిల్ ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. అదే క్ర‌మంలో రాజాసింగ్‌తో కూడా ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతార‌నే వార్త‌లొచ్చాయి. కానీ.. ఆయ‌న‌కు మాత్రం ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ట‌.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ రాజాసింగ్‌ను ర‌మ్మంటారా..?

త్వ‌ర‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. హైద‌రాబాద్‌లో రాజాసింగ్ ఫాలోయింగ్‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. మ‌రి ఆ ఎన్నిక‌ల లోగా రాజాసింగ్‌కు ఏమైనా లైన్ క్లియ‌ర్ అవుతుందా..? ప్ర‌స్తుతం పార్టీలోని ఓ వ‌ర్గం కూడా ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తోంద‌ట‌. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోగానే రాజాసింగ్‌ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాల‌నే విన్న‌పాలు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే దీనిపై ఫైన‌ల్ డెసిష‌న్ తీసుకోవాల్సింది మాత్రం బీజేపీ హైక‌మాండ్. రాజాసింగ్ విష‌యంలో బీజేపీ పెద్ద‌ల మ‌న‌సుల్లో ఏముందో మాత్రం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు గ్రేట‌ర్ ఎల‌క్ష‌న్స్‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది బీజేపీ. ఒక్కొక్క స‌మ‌స్య‌నూ ప‌రిష్క‌రించుకుంటూ ముందుకెళ్తోంది. ఇదే స‌మ‌యంలో రాజాసింగ్ ఇష్యూను కూడా క్లియ‌ర్ చేయొచ్చ‌నే టాక్ న‌డుస్తోంది. అదే జ‌రిగితే బీజేపీకి బూస్టింగ్ ల‌భించిన‌ట్టే. హైక‌మాండ్ పిలుపు కోసం రాజాసింగ్ కూడా ఎదురుచూస్తున్నార‌ట‌. ఆయ‌న కంటే ఎక్కువ‌గా ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి రాజాసింగ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకుంటారా..?

యూపీ సీఎం యోగితో రాయ‌బారం

యూపీ సీఎం యోగి ఆధిత్య‌నాథ్‌తో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రూ క‌ర‌డుగ‌ట్టిన హిందుత్వ వాదులే. అందుకే యూపీలో జ‌రిగే హిందూ స‌మ్మేళ‌నాల‌కు హాజ‌ర‌వుతుంటారు రాజాసింగ్. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందూత్వ వర్గాల్లో విస్తృతమైన పాపులారిటీ, క్రియాశీల ఫాలోయింగ్ ఉంది. సకల్ హిందూ సమాజ్ నిర్వహించే పలు సభల్లో ఆయన ప్రసంగాలకు అక్కడి హిందూత్వ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ల‌భిస్తుంది.

అంతేకాదు.. పలు వేదికలపై యోగి సిద్ధాంతాలను, బుల్డోజర్ మార్క్ పాలనను రాజాసింగ్ బహిరంగంగానే కొనియాడారు. యోగి అండదండలతో ఉత్తరప్రదేశ్‌లో గానీ, లేదా తన భావజాలానికి అనుకూలంగా ఉండే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గానీ బీజేపీ తరఫున ఆయ‌న పోటీ చేసే అవ‌కాశ‌ముంద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే దీనికి కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. పార్టీని కాద‌ని యోగీ ఆధిత్య‌నాథ్ కూడా ఏమీ చేయ‌లేరు. కాక‌పోతే ఆయ‌న్ని మ‌రోసారి పార్టీలోకి తీసుకోమ‌ని మాత్రం కేంద్ర పెద్ద‌ల‌ను కోరే అవ‌కాశ‌ముంది.

రాజాసింగ్ అభిమానులు మాత్రం ఈ ప్ర‌చారాన్ని కొట్టి పారేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ నాయ‌కుడు తిరిగి యాక్టివ్ అవుతార‌ని, అది కూడా తెలంగాణ బీజేపీలోనే జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు. చూడాలి మ‌రి.. రాజాసింగ్ భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో...

#Raja Singh#Telangana BJP#BJP High Command#Yogi Adityanath#GHMC Elections#Abhay Patil#Bandi Sanjay#Eatala
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి