సరిగ్గా 35 ఏళ్ల కిందట.. అంటే 1991 జూలై 24న మన దేశంలో ఓ అద్భుతం జరిగింది. అప్పట్లో భారతదేశం తీవ్రమైన డబ్బుల కొరతతో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కనీసం విదేశాల నుంచి పెట్రోల్ కొందామన్నా.. మన దగ్గర పైసలు లేవు. దేశంలో ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి అప్పులు తేస్తే కానీ గడవని దారుణమైన పరిస్థితి. అలాంటి టైమ్‌లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఒక్క బడ్జెట్.. మన దేశ రాతనే మార్చేసింది.
పాతకాలపు కఠినమైన నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి, ప్రపంచం మొత్తానికి భారత మార్కెట్ తలుపులు తెరిచిన ఆ చారిత్రాత్మక రోజు నేడు. 1991 మే-జూన్ నాటికి భారత విదేశీ మారక నిల్వలు కేవలం రూ.2,400 కోట్లకు పడిపోయాయి. ఇవి కేవలం మూడ వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేవి. గల్ఫ్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటడం, దేశంలో ద్రవ్యోల్బణం 13 శాతానికి చేరడం, రాజకీయ అస్థిరతలతో నూతన రుణాలు పుట్టక నాటి ప్రభుత్వం తీవ్ర దిగ్బంధంలో పడింది.
ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్బీఐ ద్వారా దేశంలోని బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. చంద్రశేఖర్ ప్రభుత్వం మే నెలలో 20 టన్నులు, ఆ తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం జులైలో మరో 47టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జపాన్ బ్యాంకుల్లో కుదువబెట్టి సుమారు 600మిలియన్ డాలర్ల అప్పును తెచ్చింది. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా జరిగినప్పటికీ, విషయం వెలుగులోకి వడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ క్లిష్ట సమయంలో జులై 24న రూపుదిద్దుకున్న బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. రూపాయి విలువను తగ్గించడం, దిగుమతి సుంకాలను గణనీయంగా పడిపోయేలా చేయడం, విదేశీ పెట్టుబడుల(FDI) రాకను సులభతరం చేసేందుకు ఎఫ్‌ఐపీబీ (FIPB)ని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి పట్టిన లైసెన్సింగ్ సంకెళ్లను తెంచివేసి, ప్రైవేటు రంగానికి విస్తృత అవకాశాలు కల్పించారు.
అప్పట్లో ఐఎంఎఫ్ (IMF) విధించిన షరతుల వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నారని కొందరు వాదిస్తే, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ముందుచూపుతోనే ఈ ప్యాకేజీ రూపుదిద్దుకుందని మరికొందరు చెబుతుంటారు. ఏది ఏమైనా, ఆ రోజున ప్రదర్శించిన రాజకీయ తెగువే నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టింది.












