నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు స్పందించింది.కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కు నోటీసులు జారీచేసింది. పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో ఎటువంటి సంస్కరణలు చేపట్టారు? సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకూడదని, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను అఫిడవిట్‌లో సవివరంగా పేర్కొనాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
అలాగే.. ప్రతిపాదిత గవర్నింగ్ బోర్డు, నిపుణుల కమిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, భద్రత, పారదర్శకత, పరిశోధన-అభివృద్ధి, మానవ వనరులు సహా పది ప్రధాన విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులు..వాటి అమలు తీరు, మిగతా వివరాలు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షల భద్రత, పర్యవేక్షణ, నిఘా కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ (ADGs) పాత్ర, వారి పనితీరు పురోగతిపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. నీట్ ఎగ్జామ్‌కు ముందు, పరీక్షా సమయం, పరీక్ష జరిగిన తర్వాత ఇలా ప్రతీ దశలోనూ చేపట్టిన సంస్కరణలపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్ అందించాలని కేంద్రం,ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది.
నీట్ పేపర్ లీకేజీ అంశంపై తాము సీరియస్‌గా ఉన్నామని, వెంటనే సంస్కరణలు అమలు చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడే దిశగా కేంద్రం చర్యలు ఉండాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. నీట్ యూజీ రీఎగ్జామ్ సమయంలో ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, రవాణా, బహుళ సెషన్ల పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు (CBT) మారే ప్రతిపాదనలతో పాటు డేటా సేఫ్టీ చర్యలపై నివేదిక కోరింది. క్వశ్చన్ పేపర్స్ సురక్షితంగా తరలించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను ఉపయోగించడం కేవలం తాత్కాలిక చర్యేనని సుప్రీం అభిప్రాయపడింది. దీనికి శాశ్వత పరిష్కారంచూపాలని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.
పరీక్షా కేంద్రాల్లో ఇటువంటి లీకేజీలను అరికట్టడానికి ‘డిజియాత్ర’వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించే ప్రపోజల్‌పైనా సమాధానం ఇవ్వాలని కోరింది. గత అఫిడవిట్‌లో వివరాలు సరిగ్గా లేవని కోర్టు వ్యాఖ్యానించగా, కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు.దీంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.












