హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది.. గంటకు సగటున రూ.10 లక్షల వరకు సుమారుగా రోజుకు రూ.2.4 కోట్ల నగరవాసుల సొమ్ము సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి! ట్రేడింగ్‌లో భారీ లాభాలు, వాట్సాప్ గ్రూపులు, ఫేక్ యాప్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. నమ్మితే క్షణాల్లో ఖాతాలు ఖాళీ.. కోట్ల రూపాయలు మాయం! ఇటీవల హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి మోసాల్లో బాధితులు కోట్ల రూపాయలు కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే హైదరాబాద్ నగరవాసులు సైబర్ మోసాల్లో దాదాపు రూ.439 కోట్లు కోల్పోయారు. సుమారు 5,600 కేసులు నమోదయ్యాయి. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 26 వేల కేసుల్లో రూ.975 కోట్లకు పైగా నష్టం జరిగింది. అంటే.. కేసుల సంఖ్య తగ్గుతున్నా.. ఒక్కో మోసంలో పోతున్న సొమ్ము మాత్రం పెరుగుతోంది.
అయితే సైబర్ నేరగాళ్లు ముందుగానే టార్గెట్‌ను ఎంచుకుంటున్నారు. ఎవరి ఖాతాలో ఎంత డబ్బుంది? ఎవరు పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు? ఎవరు రిటైర్ అయ్యారు? ఎవరు ఒంటరిగా ఉంటున్నారు? ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. ఆ తర్వాతే నేరాలకు పాల్పడుతున్నారు.
మనిషి బలహీనతలే ఇప్పుడు వారి ప్రధాన పెట్టుబడి!
త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ.. పెట్టుబడిపై భారీ లాభం వస్తుందనే అత్యాశ.. ఇవే సైబర్ నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయి. స్టాక్ ట్రేడింగ్ పేరుతో నకిలీ యాప్‌లు.. పెట్టుబడుల పేరుతో నకిలీ గ్రూపులు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు.. ఇలా మోసం చేసే విధానం మారుతోంది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ మోసాల్లో విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేయడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉంది.
వారి వద్ద జీవితకాల పొదుపు ఉండొచ్చని నేరగాళ్లు ముందుగానే అంచనా వేస్తున్నారు. భయపెట్టి.. గంటల తరబడి ఫోన్‌లో ఉంచి.. ఆలోచించే అవకాశం లేకుండా చేసి.. చివరకు ఖాతాలోని డబ్బంతా బదిలీ చేయించుకుంటున్నారు. అయితే కొత్త విధానాలతో మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ ద్వారా రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం జరుగుతోంది. అయినా.. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయకపోతే రికవరీ అవకాశాలు తగ్గిపోతాయని అధికారులు తెలియచేస్తున్నారు.
అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతో మాత్రమే మోసం చేయడం లేదు.. మన భయం, మన ఆశ, మన తొందరపాటు, మన అజాగ్రత్తలతో మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన పెంచుకుని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. ఇక మనకు తెలియని నెంబర్ల నుండి కాల్స్ వస్తే స్వీకరించకపోవడమే ఉత్తమమైన మార్గం. లేదా కాల్స్ చేసిన వ్యక్తి పై అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు..












