కాక్రోచ్‌ల ఉద్యమంపై కొన్ని ప్రాంతీయ పార్టీల సైలెన్స్
వైసీపీ స్టాండ్‌పై నో క్లారిటీ
వైసీపీ నాయకులు నేరుగా స్పందించడం లేదనే ఆరోపణలు
వైసీపీ సైలెన్స్ వెనుక కారణాలేంటి..?
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో దాదాపుగా పార్టీలన్నీ ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాయి. డైరక్ట్‌గా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోయినా.. సోషల్ మీడియా వేదికలై నుంచైనా సమర్థించడమో, విమర్శించడమో చేస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీల తీరే ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎన్డీయే పక్షాలన్నీ బీజేపీకే మద్దతిస్తున్నాయి. విద్యార్థులతో రాజకీయాలు చేయొద్దని సీజేపీని కోరుతున్నాయి. కాంగ్రెస్‌పైనా ఫైరవుతున్నాయి. ఇండి కూటమిలోని పార్టీలు సై అంటే సై అంటూ రోడ్డెక్కుతున్నాయి. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రెండు కూటముల్లో చేరని పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని పార్టీల తీరు వాళ్ల కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదట.
వైసీపీ అధినేత మనసులో ఏముంది..?
ఏపీలో టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. సహజంగానే ఆ పక్షాలు బీజేపీకే అండగా నిలుస్తాయి. ఇందులో వింతేం లేదు. కానీ అక్కడి ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం కాక్రోచ్ ఉద్యమానికి మద్దతిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న అంశంలో క్లారిటీ లేదు. ఎవరైనా ఒకరిద్దరు నాయకులు వ్యక్తిగతంగా సీజేపీ ఉద్యమంపై మాట్లాడినా.. పార్టీ మాత్రం తమ అధికార నిర్ణయాన్ని ఇంతవరకూ వెల్లడించలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మదిలో ఏముందనేది సంచలనంగా మారింది. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండి కూటములకు ఆయన సమాన దూరం పాటిస్తున్నా.. కాస్త బీజేపీ వైపే మొగ్గు చూపుతారనేది ఓపెన్ సీక్రెట్. జగన్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. రానున్న రోజుల్లో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయని, టీడీపీని బీజేపీ నమ్మడం లేదని ఆ మధ్య రకరకాల వార్తలొచ్చాయి. దీనిపై ఏపీతో పాటు తెలంగాణలో కూడా కొన్ని పరిణామలు చోటు చేసుకున్నాయి. బీజేపీ హైకమాండ్ టీడీపీని నమ్మడం లేదని కొందరు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమానం రేపాయి. ఇప్పుడు వైసీపీ సైలెంట్‌గా ఉండడం వెనుక కూడా అదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
సీజేపీకి వ్యతిరేకంగా ఏ కామెంట్ చేసినా.. అది జెన్‌జీ కి కోపం తెప్పిస్తుంది. అలాగని సమర్థిస్తే.. బీజేపీ ఆగ్రహానికి కారణమవుతుంది. ఎక్కడో ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంపై ఇప్పటికిప్పుడు కామెంట్ చేయడం అవసరమా అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఐతే రానున్న రోజుల్లో కాక్రోచ్‌ల ఉద్యమం ఉధృతమై, అన్ని రాష్ట్రాలకు పాకితే.. అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.
యువత ఓట్లే కీలకం
ఏ రాజకీయ పార్టీకైన యువత ఓట్లే కీలకం. పార్టీ తరఫున ప్రచారం చేయాలన్నా, పోలింగ్ బూత్‌ల దాకా వచ్చి ఓట్లేయాలన్నా వారికే సాధ్యం. అందుకే చూస్తూ చూస్తూ ఏ పార్టీ కూడా యువతను దూరం చేసుకోదు. అందుకే సీజేపీ మొదలుపెట్టిన ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. అయితే వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడంతో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనేది కొందరు నాయకుల వాదన. ప్రస్తుతానికైతే వేచిచూద్దాం.. తర్వాత పరిణామాలను బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని జగన్ ఆలోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.












