వర్షాకాలం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తయ్యేందుకు వచ్చింది.కానీ, దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థతుల దృష్ట్యా ఈ ఏడాది పెద్దగా వర్షాలు ఉండబోమని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. అందుకే రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవడం లేదు. దీంతో ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది.మరోవైపు వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది సాగు కూడా అంతంతే అన్నట్టు కొనసాగుతున్నది. రాష్ట్రంలో ప్రాణదాయినిగా పిలువబడుతున్న కాళేశ్వరం నుంచి సైతం నీరు రావడం లేదు.కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు వృథాగా పోతున్న మేడిగడ్డ,సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడంతో నీళ్లు ఎత్తిపోయలేమని సర్కారు చెబుతోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం నీచపు రాజకీయాలు చేస్తున్నదని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇదిలాఉండగా, తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు వెదర్ మ్యాన్ బాలాజీ శుభవార్త చెప్పారు. తాజా అంచనా మేరకు తెలంగాణలో వర్షాలు మళ్లీ కురుస్తాయని అంచనా వేశారు. శనివారంతో ప్రస్తుతమున్న పొడి వాతావరణం ముగిసి ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని వెల్లడించారు.ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. నివేదికలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి.కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. హైదరాబాద్‌తో సహా మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం, అక్కడక్కడా స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు.












