క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయంటే చాలు.. ఆధిపత్య పోరుకు ఇరుదేశాల అభిమానుల నరనరాలు తెగేంత ఉత్కంఠ నెలకొంటుంది. త్వరలో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లోనూ ఈ హై-వోల్టేజ్ డ్రామాకు తెరలేచేలా అధికారిక క్రికెట్ షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ రసవత్తర పోరును ఆస్వాదించాలంటే క్రికెట్ ప్రేమికులు కాస్త ఓపిక పట్టాల్సిందే.
టోర్నీ డ్రా ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ ముఖాముఖి తలపడాలంటే రెండు జట్లూ తమ తమ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసి నాకౌట్ (సెమీస్ లేదా ఫైనల్) దాకా రావడం ఒక్కటే మార్గం. ఈ మైండ్ బ్లాకింగ్ పోరు ఎప్పుడు, ఎలా జరగనుందో తెలియాలంటే ఈ కింది వివరాలు చూడాల్సిందే.
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను నిర్వాహకులు శనివారం అధికారికంగా ఖరారు చేశారు. గతంలో గ్వాంజూ (2010), ఇంచియాన్ (2014), హాంగ్‌జౌ (2023) ఈవెంట్ల తర్వాత ఆసియా క్రీడల క్యాలెండర్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం ఇది నాలుగోసారి. ఐసిసి అంతర్జాతీయ టీ20 హోదాతో సాగే ఈ పోరులో, గత ఎడిషన్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా (పురుషులు, మహిళల జట్లు) రెండూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడం విశేషం.
టోర్నీ పోరాటాలు ఐచి ప్రిఫెక్చర్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో జరగనున్నాయి. మహిళల విభాగం మ్యాచులు సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల పోరాటాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన పురుషుల విభాగంలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. క్వార్టర్స్‌లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ప్రిలిమినరీ స్టేజ్‌లో గ్రూప్-ఎ (అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్), గ్రూప్-బి (హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్) జట్లు తలపడతాయి.
ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ మహా సంగ్రామం ప్రారంభ రౌండ్లలో లేదా క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగే అవకాశం లేదు. డ్రా సమన్వయంలో ఇరుజట్లను వేర్వేరు హాఫ్‌లలో ఉంచడంతో, భారత్, పాకిస్తాన్ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో విజయాలు సాధిస్తేనే నాకౌట్ దశలో (సెమీఫైనల్ లేదా ఫైనల్) ముఖాముఖి తలపడే అవకాశం ఏర్పడుతుంది.












