Mahesh Goud: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. నీట్ ఆందోళనల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లలేదని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా తెచ్చుకుని బీజేపీకి దానం చేశారని ధ్వజమెత్తారు. చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని, బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందనేది నిజం అని వ్యాఖ్యానించారు. బీజేపీ బిల్లులకు పదేళ్ల పాటు బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు.
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న మహేశ్ గౌడ్.. బీఆర్ఎస్ నాటకాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ధర్నాచౌక్ ఎత్తేశారని, ఇప్పుడు అదే ధర్నాచౌక్ లో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. గతంలో చేసిన తప్పులకు కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.
ఇక, గ్లోబరీనాలో కేటీఆర్ పాత్ర ఉందని అనుమానంగా ఉందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ వాల్యుయేషన్ అప్పగించి 28మంది విద్యార్థుల మృతికి కారణం అయ్యారని ఆరోపించారు. గ్లోబరీనాపై విచారణకు ప్రభుత్వం సిద్ధం ఉందన్నారు. గ్లోబరీనాపై విచారణ కోసం కేటీఆర్ లేఖ రాయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని, ఏదీ మర్చిపోలేదని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు.












