SBI Scholarship 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పింది. వారి చదువుకు సాయం చేయనుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల నుంచి రూ. 15 లక్షల వరకు వార్షిక ఉపకార వేతనం అందించనుంది.
ప్రతిభావంతమైన పేద విద్యార్థులకు అండగా..
విద్యలో రాణించే పేద విద్యార్థులకు ఎస్బీఐ అండగా నిలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) విభాగమైన 'SBI ఫౌండేషన్' 'SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026' ను ప్రారంభించింది. ఇది దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్‌షిప్ కార్యక్రమాలలో ఒకటి. దీని కింద దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 25,707 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తుంది. కేటగిరీని బట్టి 15 వేల రూపాయల నుంచి 15 లక్షల వరకు ఉపకార వేతనం లభిస్తుంది.
9వ తరగతి నుంచి విదేశాల్లో చదివే విద్యార్థులకు భరోసా..
ఈ ఉపకార వేతనం వివిధ విద్యా విభాగాలకు చెందిన విద్యార్థుల కోసం ఉద్దేశించింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు, NIRF టాప్ 300 లేదా NAAC 'A' రేటింగ్ కలిగిన విద్యా సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) చదువుతున్న విద్యార్థులు, వైద్య విద్య (MBBS) అభ్యసిస్తున్న వారు, IIT IIM విద్యార్థులు, అలాగే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్ 200లో నిలిచిన విదేశీ విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు చేస్తున్న విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
అర్హతలు ఏంటి..
ఈ స్కాలర్ షిప్స్ కోసం అప్లయ్ చేసుకోవాలంటే గత విద్యా సంవత్సరంలో కనీసం 75శాతం మార్కులు సాధించి ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ జూలై 22 నుంచి ప్రారంభమైంది. అప్లయ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. https://www.sbiashascholarship.co.in/ వెబ్‌సైట్ ద్వారా అర్హతను నిర్దారించుకుని అప్లికేషన్ సమర్పించాలి.
"ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా, అర్హులైన ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు, వారి ఆశయాలను సాకారం చేసుకునేందుకు సమాన అవకాశం లభించాలని మేము విశ్వసిస్తున్నాము. వివిధ విద్యా మార్గాల ద్వారా నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశ వృద్ధికి, ప్రపంచ స్థాయి పోటీతత్వానికి ఊతమిచ్చే తదుపరి తరం నాయకులు, ఆవిష్కర్తలు, వృత్తి నిపుణులను తీర్చిదిద్దుతున్నాము" అని SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.












