CJP Govt Talks: కేంద్రం, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు ముగిశాయి. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ హాజరవగా.. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోశ్ వచ్చారు. ఈ చర్చల్లో పలు అంశాలపై మాట్లాడారు. గంటన్నరకు పైగా డిస్కషన్ చేశారు. చర్చల సందర్భంగా సీజేపీ ప్రతినిధులు ప్రధానంగా 3 డిమాండ్లు కేంద్రం ముందు ఉంచారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. లేదంటే..
అందులో మొదటిది, ముఖ్యమైనది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని వారు తేల్చి చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక రెండో డిమాండ్.. నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం డిమాండ్ చేసినట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక మూడో డిమాండ్ ఏంటంటే.. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి అని కోరినట్లు వారు వెల్లడించారు.
ఆ రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలం?
కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప సీజేపీ చేసిన మిగతా రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం చెప్పేందుకు కేంద్రం సమయం కోరినట్లు సమాచారం. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంగా చెప్పామని సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు.
రేపు మధ్యాహ్నం మరోసారి చర్చలు..
కేంద్రంతో చర్చల సందర్భంగా లిఖితపూర్వక ప్రతిపాదనలను జేపీ నడ్డాకు అందించారు సీజేపీ ప్రతినిధులు. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. చర్చల్లో సీజేపీ ప్రతినిధులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్నారు. సీజేపీ ప్రతినిధులు తమ ముందు మూడు డిమాండ్లు ఉంచారని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం తర్వాత మరోసారి చర్చలు ఉంటాయని జేపీ నడ్డా చెప్పారు. రేపటి చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా పేర్కొన్నారు. మొత్తంగా కేంద్రం, సీజేపీ మధ్య చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం అత్యంత కీలకం.












