భారత విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ స్వయంగా ఎయిర్‌లైన్ సేవలతో అడుగుపెట్టబోతోందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ తరహా ప్రచారాలు, కథనాలు ముమ్మాటికీ నిరాధారమైనవని, విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన తమకు అసలు లేదని సంస్థ అధికారిక ప్రకటన ద్వారా ఖండించింది. ఇటీవల అదానీ గ్రూప్ సొంతంగా ఎయిర్‌లైన్ సంస్థను ప్రారంభించనుందంటూ మార్కెట్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
మీడియాలో సైతం వరుస కథనాలు వెలువడటంతో పెట్టుబడిదారులు, విశ్లేషకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ గందరగోళానికి తెరదించుతూ అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అదానీ ఎయిర్‌పోర్ట్స్ విభాగం రూ.20వేల కోట్లకు పైగా బారీ పెట్టుబడితో ఐదు రాష్ట్రాల్లోని ఆరు విమానాశ్రయాల పరిధిలో 'ఎయిర్‌పోర్ట్ సిటీ'లను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
అయితే, ఈ ప్రాజెక్టులకు సొంత ఎయిర్‌లైన్ సేవలు ప్రారంభించాలనే ఆలోచనకు ఎలాంటి సంబంధం లేదని యంత్రాంగం స్పష్టం చేసింది. కేవలం ఎయిర్‌పోర్ట్‌ల మౌలిక సదుపాయాల ఆధునీకరణ, విమానాశ్రయ నగరాల అభివృద్ధిపైనే తాము దృష్టి సారిస్తున్నామని అదానీ గ్రూప్ వెల్లడించింది. విమాన సర్వీసులు నడపడం తమ ప్రాధాన్యం కాదని తేల్చిచెప్పడంతో, అదానీ ఎయిర్‌లైన్స్ ఎంట్రీపై వ్యాపిస్తున్న ఆందోళనలు, మార్కెట్ ఊహాగానాలకు ముగింపు పడినట్లయింది.
భారత విమానయాన రంగంలో విస్తారంగా డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, నేరుగా ఎయిర్‌లైన్ ఆపరేషన్లలో ఉండే తీవ్ర పోటీ, విమాన ఇంధన ధరల హెచ్చుతగ్గులు, నిర్వహణ సవాళ్ల దృష్ట్యా అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సొంతంగా విమానాలు నడపడం కంటే, లాభదాయకమైన విమానాశ్రయాల నిర్వహణ, రీటైల్ వ్యాపారాలు, కార్గో టెర్మినల్స్, ఎయిర్‌పోర్ట్ సిటీస్ మౌలిక సదుపాయాల కల్పనపైనే తమ దృష్టి అని అదానీ సంస్థ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది.












