ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగంలో కమీషన్ల దందా
ల్యాండ్ పూలింగ్‌లోనూ ప్లాట్ల వెనుక వసూళ్లు
లిటిగేషన్ అనుమతులకు సీఎంవో పేరు వాడకం
అన్నీ సక్రమంగా ఉన్నా మూడు ఎకరాల లే అవుట్ దాటితే దందా షురూ
అనుచరుడి నుంచి ఫోన్ వస్తేనే క్లియర్?
అప్పుడు పురుషోత్తం రెడ్డి.. ఇప్పుడు మరో రెడ్డి?
అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు?
అప్పటి విజిలెన్స్ డీఎస్పీ జగన్ లాగానే ఇప్పటి విజిలెన్స్?
పర్సంటేజీలు, ప్రతి స్క్వేర్ ఫీట్‌కు ప్రైవేట్ ఆఫీసులు పెట్టి లెక్క?
అన్నింట్లోనూ కమీషనే.. హెచ్ఎండీఏ మాటున జరుగుతున్న దందాలపై స్వేచ్ఛ న్యూస్
ఇన్వెస్టిగేషన్ స్టోరీ
అవినీతికి కేరాఫ్ అడ్రస్ హెచ్‌ఎండీఏ అని గత దశబ్దాలుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ)కి ఇది గుండెకాయ లాంటిది. అలాంటి ముఖ్యమైన కార్యాలయాల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారుల వాటాలు భారీగా పెరిగిపోయాయి అనడానికి అరవింద్ కుమార్‌పై ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిదర్శనం. ప్రజెంట్ ఆ శాఖను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. కానీ అక్రమాలు ఎక్కడా తగ్గడం లేదు. విభాగాల్లో అవినీతి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగం, ల్యాండ్ పూలింగ్ చేసే అధికారులు తమకు కమీషన్లు ఇవ్వాలని ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్లానింగ్ విభాగం ఫైల్ అందగానే సైట్ ఇన్‌స్పెక్షన్ నుంచి దాని అనుమతి వచ్చే వరకు చేతులు తడిపితేనే ఫైల్ కలుదుతోంది. ఇంజినీరింగ్ వారు ప్రతి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కమీషన్ల దందాను కొనసాగిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌లోనూ రైతుల నుంచి ప్లాట్లను కమీషన్ల కింద అధికారులు దండుకుంటున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వస్తే నివేదిక ఇవ్వాల్సిన విజిలెన్స్ అధికారులు సైతం ముడుపులు తీసుకొని ఫైళ్లను క్లోజ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హెచ్ఎండీఏ అంటే ముడుపులు కామన్ అనేలా అంతా మారింది.
ప్లానింగ్ అంతా ఆ ఇద్దరి కనుసన్నల్లోనే
గత బీఆర్ఎస్ సర్కార్‌లో హెచ్ఎండీఏ కమిషనర్ నుంచే ప్లానింగ్ ఫవర్ ఫుల్‌గా నడిచేది. ఇప్పుడు ఈ అధికారాలను జాయింట్ కమిషనర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు మెట్రో అదనపు బాధ్యతలు ఉండడంతో ఆయన దృష్టి సారించడం లేదని, దీంతో కిందిస్థాయి అధికారులు పంపించిన ఫైళ్లపై జేసీనే సంతకం పెట్టి పంపిస్తున్నారని వినికిడి. ఈ మధ్యే హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ గ్రూప్ 1 అధికారి ఐఏఎస్ కన్‌ఫర్డ్ కావడంతో మొత్తం ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫైళ్లు ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీనికి కారణం ఆయన ఏది చెప్పినా చేయడమే, ఎవరి ఫైల్ ముట్టాలో ముట్టకూడదో ఓ వ్యక్తి తృప్తి చెందితేనే ఆయనకు ఆదేశాలు వస్తాయని వినికిడి. లే అవుట్‌ల అనుమతుల కోసమైనా, బహుళ అంతస్థుల నిర్మాణం కోసమైనా ముందుగా ఆయన్ను కలిసి కమీషన్ల గురించి మాట్లాడుకుంటేనే ఆ ఫైల్ ముందుకు కదులుతుందని రియల్టర్లు వాపోతున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కమిషనర్ నామమాత్రంగానే కొనసాగుతున్నారని మిగతా మొత్తం కార్యకలాపాలన్నీ ఈ ఇద్దరే చక్కబెడుతున్నారని హెచ్‌ఎండీఏలో టాక్ నడుస్తోంది.
వసూళ్ల రాజా.. ఆ సీపీఓనే?
ప్రస్తుతం ఈ ఇద్దరికి మధ్యవర్తిగా ఓ సీపీఓ వ్యవహరిస్తున్నారని, వసూళ్లు మొత్తం ఆ అధికారి ఆధ్వర్యంలో జరుగుతోందని తెలిసింది. ఎవరి వాటాలను వారికి పంచడంలో ఈయన సిద్ధహస్తుడని, ప్రస్తుతం ఈయన కూడా వాటాల పేరుతో బాగానే వెనకేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్లానింగ్ విభాగంలో నలుగురు డైరెక్టర్లు ఉన్నా వసూళ్లు మొత్తం సీపీఓ ఆధ్వర్యంలోనే జరుగుతోందని టాక్. కమీషన్లు ఈయనకు చేరిన తరువాతే ఫైళ్లపై సంతకాలు జరుగుతాయని తెలిసింది. డైరెక్టర్లకు ఎంత కమీషన్ ఇవ్వాలన్నది కూడా ఈ సీపీఓనే నిర్ణయిస్తారని రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సీపీఓ ప్రస్తుతం షాడో కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారని ఫైల్‌పై సంతకం కోసం అందరూ ఆయన్ను కలవాల్సిందేనని తెలుస్తోంది.
అప్పుడు బీఎల్ఎన్ రెడ్డి.. ఇప్పుడు రవీందర్?
గతంలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేసిన బీఎల్‌ఎన్ రెడ్డి నుంచి మొన్న ఏసీబీకి పట్టుబడ్డ రవీందర్ వరకు ఇంజినీరింగ్ అధికారులు రిటైర్ అయినా కూడా చక్రం తిప్పుతున్నారు. చాలామంది రిటైర్ అయిన అధికారులు ఇంకా అక్కడే కొనసాగుతూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లను వసూళ్లు చేస్తున్నారు. వాటిని వాటాలుగా పంచడమే ఇంజినీర్ శాఖ పనిగా తయారైందని తెలుస్తోంది. సీఈలు మారినా వారు మారడం లేదని, రిటైర్ అయిన వారిని వసూళ్ల కోసం అక్కడే కొనసాగిస్తున్నారనే టాక్ వినబడుతోంది. గతంలో సీఈగా పని చేసిన బీఎల్‌ఎన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్లైఓవర్లు, పార్కుల నిర్మాణాలకు సంబంధించి కోట్లలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే బీఎల్‌ఎన్ రెడ్డిని తప్పించడంతో ఆయన స్థానంలో ఓ మహిళా అధికారి ఇన్‌చార్జ్ సీఈగా బాధ్యతలు చేపట్టారు. ఆ అధికారి సంవత్సర కాలం పాటు హెచ్‌ఎండీఏలో పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ అధికారిని హెచ్‌జీసీఎల్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేసే రవీందర్‌ను సీఈగా హెచ్‌ఎండీఏలో పోస్టింగ్ ఇచ్చారు. రవీందర్ కూడా ఈ రిటైర్ ఇంజినీరింగ్ అధికారులను అలాగే కొనసాగిస్తూ కమీషన్ల దందాను కొనసాగించారు. దీంతో ఏసీబీ అధికారులు ఈయన ఆస్తులపై ఫోకస్ పెట్టారు. 2026 జూలైలో ఈయన ఇంటిపై దాడులు చేసి భారీగా ఆస్తులను, నగదును, బంగారాన్ని గుర్తించారు. సంవత్సరన్నర కాలంగా సీఈ రవీందర్ దగ్గర పేషీలో పనిచేసే ఒక డీఈ, మరో ముగ్గురు రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారులు కూడా భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నారని, ముడుపులు ముట్టచెబితే తమ ఫైల్‌పై వారు సంతకం చేసే వారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్‌లోనూ అదే తీరు
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే ల్యాండ్ పూలింగ్‌లోనూ రైతులను నయానో భయానో ఒప్పించి సేకరించే అధికారులు ప్లాట్లను కొట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ మహిళా అధికారి అవినీతిపై ఫిర్యాదులు అందగా ఆమెను ఆదిలాబాద్ బదిలీ చేశారు. ఆమె కొత్త పోస్టులో చేరలేదు. దాంతో 2026 మేలో సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ కీ పొజిషన్‌లో కూర్చోబెట్టారని విమర్శలు ఉన్నాయి. ఇలా ఎవరికి వారే హెచ్‌ఎండీఏను దోచుకోవడం గమనార్హం. అన్ని విభాగాలపై నిఘా వేయాల్సిన విజిలెన్స్ విభాగం సైతం ఫిర్యాదులు అందగానే వారితో కుమ్మక్కై ముడుపులు తీసుకొని చర్యలు లేకుండా ఫైళ్లను క్లోజ్ చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ అధికారులు
పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ దాడులు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు రూ.9 కోట్లు ఇచ్చానని నేరుగా ఏసీబీకి పట్టుపడ్డ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణనే ఒప్పుకున్నాడు. ఓఆర్ఆర్ లీజుతో పాటు కార్ రేస్ నిర్వహణలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక ఆరోపణలు అక్రమాస్తులపై ఏసీబీకి సమాచారం ఇచ్చినా వాళ్లకు అనుకూలంగా ఉన్న సమయంలోనే గురి పెట్టి డీఏ కేసులు నమోదు చేస్తున్నారు. కానీ తీసుకున్న సమయంలో అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించడం లేదు. కాంగ్రెస్ సర్కార్‌లో ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ కావడంతో సీఎంవో పేరుతో చాలా మంది స్క్వేర్ ఫీట్‌కు 50 నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నట్లు రియల్టర్స్ కోడై కూస్తున్నారు. ఇక లే అవుట్స్‌కు కూడా అలానే పైసలు డిమాండ్ చేస్తున్నారని ప్రైవేట్ ఆఫీసులు తెరిచి మరీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరి బాగోతాలపై బిల్డర్స్ భగ్గుమంటున్నారు. అసలే రియల్ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంది. అన్నీ బాగున్నా అనుమతులకు ఇంతలా ఖర్చు ఎందుకు చేయాలని వాపోతున్నారు. ఈ లెక్కలు లేకుండా తమకు ఫెయిర్‌గా ఉంటే వెంటనే ఈజీ డూయింగ్ బిజినెస్‌లా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారు.
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ చైర్మన్ న్యూస్,
9848070809












