అన్నమయ్య జిల్లా విషాద ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ విభాగంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమయంలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం తహసీల్దార్ మృతి సంచలనంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో శ్రీనివాసులు రామాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల అనంతరం ఆయనను లక్కిరెడ్డిపల్లెకు బదిలీ చేశారు. ఆ సమయంలో పీజీఆర్‌ఎస్ అర్జీ ఆధారంగా వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆ మండల వీఆర్వో వెంకటరమణ సస్పెండ్ కాగా.. శ్రీనివాసులను కలెక్టరేట్‌లోని కేఆర్‌ఆర్‌సీ విభాగానికి బదిలీ చేశారు.
జిల్లా కేంద్రం మదనపల్లెకు మారిన తర్వాత శ్రీనివాసులు పీజీఆర్‌ఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇటీవల ఉన్నతాధికారులు మరోసారి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తప్పులు జరిగినట్లు గుర్తించి సీసీఎల్‌ఏకు నివేదించినట్లు సమాచారం.
ఇటీవల అనారోగ్య కారణాలతో శ్రీనివాసులు సెలవు పెట్టి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయన భార్య కూడా సదుం ఎంపీడీవోగా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. ఆయన కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికాలో ఉండగా.. కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్‌పీఎస్ పోలీసులు తెలిపారు. శ్రీనివాసుల మృతికి అసలు కారణం ఏమిటి? అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.












