Health

Health: గ్రీన్ టీ ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగిస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?..

రచన: Venu5 నిమిషాల పఠనం

గ్రీన్ టీ తాగితే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? గుండె రక్తనాళాలు శుభ్రం అవుతాయా? బరువు వేగంగా తగ్గుతుందా?.. సోషల్ మీడియాలో గ్రీన్ టీ గురించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వైరల్ అవుతున్నాయి.

గ్రీన్ టీ తాగితే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? గుండె రక్తనాళాలు శుభ్రం అవుతాయా? బరువు వేగంగా తగ్గుతుందా?.. సోషల్ మీడియాలో గ్రీన్ టీ గురించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వైరల్ అవుతున్నాయి. కానీ వీటిలో ఉన్న నిజం ఏది?..

గ్రీన్ టీలో క్యాటెకిన్స్, పాలీఫీనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో కొంత సహాయపడవచ్చు. అందుకే గ్రీన్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. ముందుగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ టీ క్యాన్సర్ కణాలను నేరుగా నాశనం చేస్తుందని లేదా పెద్దప్రేగు, కడుపు, క్లోమం, పిత్తాశయ క్యాన్సర్లను అడ్డుకుంటుందని నిర్ధారించే బలమైన ఆధారాలు ప్రస్తుతం లేవు.

వివిధ క్యాన్సర్లపై జరిగిన అధ్యయనాల ఫలితాలు ఒకేలా లేవు. కాబట్టి గ్రీన్ టీని క్యాన్సర్‌కు చికిత్సగా భావించడం సరైంది కాదు. ఇక గుండె ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ప్రయోజనం ఉండొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ కొలెస్ట్రాల్‌లోని ఎల్‌డీఎల్ స్థాయిలను స్వల్పంగా తగ్గించవచ్చు. రక్తపోటుపై కూడా చిన్న స్థాయిలో ప్రయోజనకరమైన ప్రభావం కనిపించినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.

అయితే ఇది గుండెపోటును పూర్తిగా నివారిస్తుందని, గుండె రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగించి శుభ్రం చేస్తుంది అనడం శాస్త్రీయంగా సరైనది కాదు.. అలాగే బరువు తగ్గడంపై కూడా వాస్తవం తెలుసుకోవాలి. గ్రీన్ టీలోని కెఫీన్, క్యాటెకిన్స్ శరీర బరువుపై స్వల్ప ప్రభావం చూపవచ్చు. కానీ గ్రీన్ టీ ఒక్కటే తాగడం వల్ల గణనీయంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. ఆహార నియంత్రణ, వ్యాయామం, తగిన నిద్ర ఇవే ప్రధానమైనవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి, వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో గ్రీన్ టీకి కొన్ని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నప్పటికీ, కీళ్లవాతం నయం చేస్తుంది లేదా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. . ఇక గ్రీన్ టీని తీసుకోవడం పెద్దలకు సాధారణంగా మంచిదే. కానీ అధిక మోతాదులో గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ క్యాప్సూల్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అరుదుగా కాలేయానికి నష్టం కలిగిన ఘటనలు నమోదయ్యాయిని నిపుణులు అంటున్నారు.

కాబట్టి గ్రీన్ టీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం మాత్రమే.. ఏ వ్యాధికైనా ప్రత్యామ్నాయ చికిత్స కాదు. మితంగా తీసుకోవడం మంచిదే. కానీ మీరు మందులు వాడుతున్నా, కాలేయ సమస్యలు ఉన్నా.. గ్రీన్ టీ సప్లిమెంట్స్ తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Indian#Health#green tea#health benefits#Catechins#polyphenols
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి