AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ తేదీకి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే, రాష్ట్రమంతా ఇది వర్తించదు. కేవలం ఉత్తరాంధ్రకు వర్తిస్తుంది. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో రెండు రోజుల ముందుగానే అంటే జూలై 30వ తేదీనే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వనున్నారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకరోజు ముందు కూడా ఇస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ముందస్తు పంపిణీ జరగనుంది. 11.98 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ల కోసం రూ.514 కోట్లను సర్కార్ సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు ఇవ్వనున్నారు.
ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్స కార్యక్రమం ఉంటుంది. దీనికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఆ సమయంలో అధికారులు బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇటు ఉద్యోగులు, అటు లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మాత్రం యధావిధిగానే ఆగస్ట్ 1వ తేదీనే పించన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.












