Kollywood: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తన మార్కు పాలనతో దూసుకుపోతున్న దళపతి విజయ్.. మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం సీటులో ఉంటూనే మళ్లీ కెమెరా ముందుకు రావడం ఆయనకు సాధ్యమేనా? ఒకవేళ నటిస్తే ఆయన ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
నిజానికి సమయాన్ని కేటాయించడమే విజయ్‌కి అతిపెద్ద సమస్యగా మారనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 24 గంటలూ ప్రజాసేవకే అందుబాటులో ఉండాలి. నిత్యం ప్రభుత్వ సమీక్షలు, ప్రజా సమస్యల పరిష్కారం, శాంతిభద్రతల పర్యవేక్షణ, సచివాలయ వ్యవహారాలతో ప్రతిరోజూ ఎంతో బిజీగా ఉంటుంది. మరోవైపు, ఒక సినిమా పూర్తి చేయాలంటే నెలల తరబడి షూటింగ్‌లలో పాల్గొనాలి. డ్యాన్సులు, ఫైట్స్, అవుట్‌డోర్ షెడ్యూల్స్ కోసం సమయం కేటాయించాలి. రోజూ ఉండే సీఎం బాధ్యతలకు, సినిమా షూటింగ్ ప్రాజెక్టులకు మధ్య టైమ్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.
మరోవైపు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడం కూడా పెద్ద సవాలే. సీఎం హోదాలో ఉండి ఏ చిన్న పొరపాటు జరిగినా, "రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు" అని ఆపోజిషన్ ఈజీగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ కమర్షియల్ సినిమాల ద్వారా ఆదాయం పొందడంపై చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. సినిమాలో చెప్పే కల్పిత డైలాగులను, రాజకీయ ప్రత్యర్థులు వాస్తవ ఘటనలకు ముడిపెట్టి వివాదాలు సృష్టించే ప్రమాదం కూడా ఉంది.
గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహానాయకులు కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మరి విజయ్ కూడా వారినే ఆదర్శంగా తీసుకుని 'జన నాయగన్' సినిమానే తన చివరి చిత్రంగా మిగిల్చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోతారా? లేక ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి, సీఎం హోదాలో ఉంటూ సినిమాలు చేసే ఏకైక హీరోగా కొత్త చరిత్ర సృష్టిస్తారా అనేది వేచి చూడాలి.












