Cm Revanth: క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ మహానగర తాగు నీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ఎంసీహెచ్ఆర్డీలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలన్నారు. ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం తేల్చి చెప్పారు.
ఎస్టీపీల నిర్మాణ పనులపై సీఎం ఆరా తీశారు. ఎస్టీపీల నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు. తాగు నీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు.












