Tollywood: టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో 'పటాస్' నుంచి 'భగవంత్ కేసరి' వరకు వరుస విజయాలతో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. కామిడీకి సరైన కమర్షియల్ ఎమోషన్ జోడించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. అయితే, అనిల్ రావిపూడి సాధిస్తున్న ఈ దండయాత్ర వెనుక అసలు రహస్యం ఏమిటి? ఆయన కామెడీ టైమింగ్ వెనుక ఉన్న ఆ ఇద్దరు దిగ్గజాలు ఎవరు అనే ప్రశ్న వస్తే.. టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాధానం హాస్య బ్రహ్మ జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ.
హాస్యానికి పాత రోజుల్లో ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు జంధ్యాల. ఆయన సినిమాల్లోని సంభాషణలు, అమాయకమైన పాత్రలు ప్రేక్షకులను పడి పడి నవ్వించేవి. అనిల్ రావిపూడి తన రచనలో జంధ్యాల నైపుణ్యాన్ని స్పష్టంగా ఒంటపట్టించుకున్నారు. జంధ్యాల సినిమాల్లో లాగే అనిల్ సినిమాల్లో కూడా చిన్న చిన్న డైలాగ్స్, ప్రాసలు, పాత్రల నడుమ నడిచే సంభాషణలే ప్రధాన హాస్యంగా మారతాయి. వినోదాన్ని సాధారణ సంభాషణల నుంచే రాబట్టడం అనిల్ రావిపూడికి జంధ్యాల నుంచి అబ్బిన అతిపెద్ద ప్లస్ పాయింట్.
అలాగే సినిమా అంటే కేవలం నవ్వించడమే కాదు, థియేటర్‌లో ప్రేక్షకుడు ఏమాత్రం బోర్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కట్టిపడేయడం ఈవీవీ సత్యనారాయణ నైజం. లాజిక్ ల కంటే మ్యాజిక్ కే ప్రాధాన్యమిస్తూ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కామెడీని పండించడంలో ఈవీవీ సిద్ధహస్తుడు. అనిల్ రావిపూడి మేకింగ్ లో ఈవీవీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3స, 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాల్లోని సిట్యుయేషనల్ కామెడీ, లాజిక్ పక్కన పెట్టి కేవలం నవ్వులకే ప్రాధాన్యత ఇవ్వడం ఈవీవీ ప్రేరణతోనే అంటారు.
జంధ్యాల నుంచి రచనా వైవిధ్యం, ఈవీవీనుంచి కమర్షియల్ టైమింగ్ & మాస్ వినోదాన్ని పుణికిపుచ్చుకున్న అనిల్ రావిపూడి, ఆ రెండు శైలులను నేటితరం ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్చారు. మొత్తానికి పాత తరం హాస్యానికి, ఈతరం ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రెండ్‌ను మిక్స్ చేసి సరికొత్త రావిపూడి బ్రాండ్ క్రియేట్ చేయడంలో అనిల్ సూపర్ సక్సెస్ అయ్యారు.












