గుజరాత్‌లో గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవసారి, సూరత్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు గుజరాత్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభావిత జిల్లాల్లో సహాయక, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్‌తో పాటు కార్యదర్శులు రమ్య మోహన్, అలోక్ పాండేలు వెంటనే సూరత్, వల్సాద్, నవసారి జిల్లాలకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇక రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఇన్‌చార్జ్ కార్యదర్శులు స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా నవసారి జిల్లాలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. పూర్ణ, అంబిక, కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కావేరి నది నీటిమట్టం ప్రమాదస్థాయి 19 అడుగులు దాటి 27 అడుగులకు చేరడంతో.. చిఖ్లిలోని 20 అడుగుల ఎత్తైన శివాలయాన్ని సైతం వరదనీరు తాకింది.
భారీ వర్షాలతో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు కలిసి ఇప్పటివరకు 500 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవసారి జిల్లాలో సగటున 10.17 అంగుళాల వర్షపాతం నమోదవగా, వాన్స్‌డా తాలూకాలో అత్యధికంగా 17.13 అంగుళాలు, ఖేర్‌గామ్‌లో 14.09 అంగుళాల వర్షపాతం నమోదైంది.
మరోవైపు అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక భారీ వర్షాల ప్రభావం రైల్వే సేవలపైనా పడింది. వల్సాద్ సమీపంలోని ఘోలాద్–ఉమర్‌గామ్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి నంబర్ 203 వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండటంతో పశ్చిమ రైల్వే ముంబై సెంట్రల్ డివిజన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.












