తెలంగాణలో ఎల్-నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న నెలల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో వచ్చిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి.. రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని మంత్రి తెలిపారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. వచ్చే నెలల్లోనూ ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని.. సెప్టెంబర్ నాటికి దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు. డిసెంబర్ నాటికి పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున.. ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం తెలంగాణలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. గోదావరి, కృష్ణా నదులకు భారీ వరదలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలని నిర్ణయించుకోవద్దంటూ సూచించారు.
అలాగే భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నందున.. బోరుబావులను నమ్ముకుని వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధిక నీటి అవసరమున్న వరి, పత్తి వంటి పంటలకు బదులుగా.. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అలాగే సూక్ష్మ సేద్యం, డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
మరోవైపు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు తెప్పించి.. రైతులకు సబ్సిడీపై అందించే అంశాన్ని కూడా పరిశీలించాలని తెలిపారు.
అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను సైతం తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
మరోవైపు రైతులకు మరింత రుణ సహాయం అందించాలని బ్యాంకులను కోరారు. ఈ ఏడాది 58 వేల కోట్ల రూపాయల పంట రుణాల లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 20 వేల కోట్ల రూపాయలు రైతులకు అందించినట్లు బ్యాంకర్లు తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌కు రుణ సహాయం పెంచాలని నాబార్డును కోరారు.. అలాగే ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
చెరువుల పూడికతీత, ఫార్మ్ పాండ్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల సంరక్షణ వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సుమారు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులను అధిక నీటి అవసరమున్న పంటల నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు.
మొత్తంగా.. ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.












