National

Delhi: ముదురుతున్న నీట్ వివాదం.. నిరసనకారులపై పోలీసుల సంచలన నిర్ణయం!

రచన: Venu4 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సంసద్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. జంతర్‌మంతర్‌ వేదికగా కొనసాగుతున్న నిరసనలకు విద్యార్థులు, యువతతో పాటు విపక్ష పార్టీలు, సినీ ప్రముఖులు, క్రికెటర్ల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హింసాత్మక నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు పరిపాలనా పరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే వారి పాస్‌పోర్ట్ రద్దు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సంసద్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు పార్లమెంట్ భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

లాఠీచార్జ్‌తో పాటు అల్లర్ల నియంత్రణకు పలు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన సీజేపీ.. పోలీసుల చర్యలకు నిరసనగా జూలై 24న దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. మరోవైపు, జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు భారీగా మద్దతు పెరుగుతోంది.

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం జరిగిన లాఠీచార్జ్ వీడియోలు వైరల్ కావడంతో బుధవారం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ వేడెక్కింది. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ తన మాట నిలబెట్టుకోలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిరసనలను మరింత ఉధృతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఎదుట కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో విద్యార్థుల ఆందోళనలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

#National#Delhi#NEET exam#police#sensational decision
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి