Delhi Protests: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తీవ్రతరం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేలా జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు డిటెన్షన్ పవర్స్ మంజూరు చేసింది. ముందస్తు అరెస్టులు చేసేలా అపరిమిత అధికారాలు కల్పించింది. ఎన్ఎస్ఏ ప్రకారం ఎవరినైనా ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండానే 12 రోజుల నుంచి 12 నెలల వరకు నిర్బంధించే అధికారం ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ పవర్ వినియోగించుకునేలా కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు జంతర్ మంతర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సాయంత్రం 6.30 గంటలకే షాపులు, రెస్టారెంట్లు, ఆఫీసులు మూసివేయాలని ఎన్డీఎంసీ చైర్మన్ ఆదేశించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఆందోళనకారుల వల్ల ఆస్తి నష్టం లేదా పౌరులకు ఎలాంటి గాయాలు కాకుండా చూసేందుకే ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
ఓవైపు జాతీయ భద్రతా చట్టం అమలు, మరోవైపు ఆంక్షలు, ఇంకోవైపు భారీగా బలగాల మోహరింపు.. దీంతో ఢిల్లీలో ఏం జరగనుంది అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటి పెంచారని, భారీగా అంబులెన్సులు వస్తున్నాయని.. దీంతో ఈ రాత్రికి కేంద్రం ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్లు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం మరోసారి నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేసేందుకే ఇలాంటి భారీ ఏర్పాట్లు చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద తమ అధికారాలను 3 నెలల పాటు (జూలై 19 నుండి అక్టోబర్ 18, 2026 వరకు) పొడిగించే సాధారణ ప్రక్రియను, ప్రస్తుతం జరుగుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసనలతో ముడిపెట్టడం అవాస్తవమని ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ వివరణ వచ్చింది.
ఈ ఏడాది జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు వర్తించేలా ప్రస్తుత పొడిగింపు ఉత్తర్వును జూన్ 7న జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. CJP నిరసన ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి పరిణామాలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక అభ్యర్థన గానీ, ఉత్తర్వు గానీ జారీ చేయలేదన్నారు. ఈ పునరుద్ధరణ.. నిరసనలకు ముందే జరిగిందని, ఇది ప్రామాణిక పరిపాలనా ప్రక్రియలో భాగమని, దీనిని కొనసాగుతున్న నిరసనలతో ముడిపెట్టకూడదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి" అని వివరణ ఇచ్చారు.












