Honeymoon Case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య దారుణానికి ఒడగట్టింది. అక్కడే అతడిని అత్యంత కిరాతకంగా చంపించింది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు మేఘాలయ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 3 వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ కు గల కారణాలను తెలపడంలో లోపాలు ఉన్నాయంటూ దిగువ కోర్టులు ఆమెకు బెయిల్ ఇచ్చి పొరపాటు చేశాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, పిబి వరలేతో కూడిన ధర్మాసనం సోనమ్‌పై ఉన్న ఆరోపణలు "చాలా తీవ్రమైనవి" అని పేర్కొంది. ఒకవేళ విచారణ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.
విచారణ సందర్భంగా, దేశ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. "వైవాహిక వివాదాలు పెరుగుతున్న కొద్దీ, వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్దలు వాటిని పరిష్కరించే వారు.
కానీ చిన్న కుటుంబాల విషయంలో వారు ఒంటరిగా ఉండటం వల్ల విడిపోవడాలు పెరుగుతున్నాయి. అలాగే కుంగుబాటు (డిప్రెషన్) సమస్యలు కూడా అధికమవుతున్నాయి" అని మెహతా వాపోయారు. "ప్రస్తుత తరం మనకంటే ఎక్కువ జ్ఞానవంతులు కావచ్చు. కానీ ఒత్తిడిని ఎదుర్కోవడంలో మాత్రం వారు మరింత బలహీనంగా ఉన్నారు" అని జస్టిస్ సుందరేశ్ అన్నారు.
రాజా రఘువంశీ హత్యోదంతం
రాజా రఘువంశీ, సోనమ్ గత ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. తొమ్మిది రోజులకు మే 20న మేఘాలయకు హనీమూన్ కోసం బయలుదేరారు. అక్కడికి వెళ్లిన 3 రోజుల తర్వాత అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 10 రోజుల తర్వాత అంటే జూన్ 2న ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభించడంతో కలకలం రేగింది.
జూన్ 7 రాత్రి, ఘాజీపూర్‌లోని ఒక 'ఢాబా' వద్ద సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. చికిత్స కోసం ఆమెను ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా, అక్కడ ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆ తర్వాత సోనమ్ ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. షిల్లాంగ్ జిల్లా జైలులో సుమారు 10 నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు, ఈ ఏడాది ఏప్రిల్ 27న విచారణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె అరెస్టుకు గల కారణాలను దర్యాప్తు సంస్థ సరిగ్గా తెలియజేయడంలో విఫలమైందని కోర్టు పేర్కొంది.












