International

US-Iran War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 30 శాతం పెరిగిన క్రూడ్‌ ఆయిల్ ధరలు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో గురువారం బ్రెంట్ క్రూడ్ ధర ఆరు వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 30 శాతం పెరగడం గమనార్హం.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యుల బ్రతుకుల్లో మంటలు పెడుతున్నాయి. అలాగే ఈ ప్రభావం నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఈ క్రమంలో గురువారం బ్రెంట్ క్రూడ్ ధర ఆరు వారాల గరిష్ఠానికి చేరుకుంది. బ్యారెల్‌కు 96 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది.

వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా 88 డాలర్లకు చేరువలో ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 30 శాతం పెరగడం గమనార్హం. ఇక హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ దాదాపు నిలిచిపోయే స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా.. అంతర్జాతీయ సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

మరోవైపు.. ఎర్ర సముద్రంలో హూతీలు సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఒకేసారి హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ఇక ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

నేటి ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు తగ్గి 76,454 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 96.48గా ట్రేడ్‌ అవుతోంది. పెరుగుతున్న క్రూడ్ ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులపై ఆందోళనలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మరోవైపు చమురు ధరలు ఇలాగే పెరుగుతూ.. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే.. దిగుమతి వ్యయం పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం వంటి ప్రభావాలు భారత్‌పై పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

#International#US-Iran War#Oil Prices#Brent Crude#rise by 30%#West Asia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి