ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబానికి చెందిన ఆస్తి వేలం వివాదంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని లోన్ బకాయిల వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని గతంలో హైకోర్టు సమర్థించింది.. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే రూ.71.44 కోట్లతో పాటు మొత్తం రూ.129.02 కోట్ల వరకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద బ్యాంక్‌కు చెల్లించామని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బకాయిలు చెల్లించిన తర్వాత కూడా ఆస్తిని వేలం వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బ్యాంక్ ఆస్తి వేలం వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, బండ్ల గణేశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. మరోవైపు శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి.. బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు. అయితే రుణం చెల్లింపులో సమస్యలు తలెత్తడంతో.. బ్యాంక్ వాళ్ళ ఆస్తిని వేలం వేసింది.
ఈ వేలాన్ని సవాలు చేస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్.. అంటే డీఆర్‌టీనీ ఆశ్రయించారు. విచారణ అనంతరం వేలం ప్రక్రియను రద్దు చేసిన ట్రైబ్యునల్.. ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారుడికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.. బ్యాంక్ నిర్వహించిన వేలం ప్రక్రియను సమర్థించింది.












