EPFO Interest: ఉద్యోగుల ఖాతాల్లో ఇంట్రస్ట్ జమ చేసినట్లు ఇటీవలే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్ పని చేయలేదు. దాంతో చాలా మంది ఉద్యోగులు బ్యాలెన్స్ చెక్ చేసుకోలేకపోయారు. తాజాగా దీనికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ జమ అవుతోంది. వడ్డీ జమకు సంబంధించిన వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో ఫోన్ కు పంపుతోంది. ఖాతాల్లో అప్పటివరకు ఉన్న మొత్తాన్ని బట్టి 8.25 శాతం వడ్డీ వేస్తోంది ఈపీఎఫ్ఓ.
2025-26కి ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులకు వడ్డీ జమ చేసే ప్రక్రియ జులై 15 ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్ని జమ చేసింది.
గతంలో EPF వడ్డీ రేటు ప్రకటించిన తర్వాత కూడా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి అక్టోబర్ లేదా నవంబర్ వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే కొత్త CITES డిజిటల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా మారింది. దీంతో వడ్డీ జమ ప్రక్రియను చాలా వేగంగా పూర్తి చేయగలుగుతున్నారు.
Centralised IT Enabled Services (CITES) EPFO చేపట్టిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్. దీని ప్రధాన ఉద్దేశ్యం సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించడం. ఈ వ్యవస్థలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్న సభ్యుల డేటాను ఒకే జాతీయ డేటాబేస్‌లోకి మార్చారు. దీంతో సభ్యుల సేవలు ఇకపై ఏ ఒక్క ప్రాంతీయ కార్యాలయానికీ పరిమితం కావు. దేశంలోని ఏ అధీకృత EPFO కార్యాలయం నుంచైనా సేవలు పొందే అవకాశం ఉంటుంది.












